ఎమ్మెల్యేగా గెలిచే సత్తా లేదు కానీ, నారా లోకేష్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కరోనా టైమ్ లో బైటకు వచ్చే ధైర్యం చేయడంలేదు కానీ అధికారపక్షంపై మాత్రం ఎదురుదాడి చేస్తానంటూ సవాళ్లు విసురుతున్నారు చినబాబు. తండ్రి ఇంటికి రావడంతో, కొడుకు పరామర్శల పర్వానికి బయలుదేరారు.
ఇటీవలే బెయిలుపై విడుదలైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించిన అనంతరం లోకేష్ సినిమా డైలాగులు కొట్టారు. వడ్డీతో సహా చెల్లిస్తాం, అన్నీ మరచిపోతామని అనుకోవద్దు అంటూ వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు. ఆయన మామ బాలయ్య స్టయిల్ లో చెప్పాలంటే లోకేష్ మాటలకు ఎవరైనా సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వాల్సిందే.
151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీ భయంతో వణికిపోతోందని, మంత్రులు, ఎమ్మెల్యేలంతా జగన్ పేరు కాకుండా చంద్రబాబు పేరు కలవరిస్తున్నారని అన్నారు లోకేష్. వైసీపీ నేతలంతా ఫ్రస్టేషన్లో ఉన్నారట, ఆ ఫ్రస్టేషన్లోనే వారికి బూతులొస్తున్నాయట.
ఓటమి భారం మోయలేక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లింది ఎవరు? ఆ ఫ్రస్ట్రేషన్లో ఏంచేయాలో తెలియక, రాజీనామాలు చేయండి, ఎన్నికలకు వెళ్దామంటూ వైసీపీ నేతల్ని బతిమిలాడుకుంది ఎవరో లోకేషే ప్రజలకి చెప్పాలి. అంతే కాదు, లోకేష్ కూడా తన తండ్రిలా కాలజ్ఞానం మొదలుపెట్టారు. వచ్చే దఫా ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందని, వైసీపీకి సంబంధించి మినిమమ్ 40మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తారని జోస్యం చెప్పారు.
పేదల వద్ద తక్కువ రేటుకి భూమిని కొనుగోలు చేసి, ప్రభుత్వానికి వైసీపీ నాయకులే అమ్మేస్తున్నారని, పేదల జేబులు కొట్టేసినవాళ్లెవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదని శాపనార్థాలు పెట్టారు. ఇలాంటి శాపనార్థాలు తగిలే బాబు గ్యాంగ్ 23సీట్లకి పరిమితమైన విషయాన్ని కూడా లోకేష్ పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది.
ఇక హిందూత్వ అజెండాపై కూడా డైలాగులు కొట్టారు చినబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, తిరుమల వెళ్లే బస్సు టికెట్ల వెనకాల అన్యమత ప్రచారం జరిగిందని, గుడులు-విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని, రథాలు తగలబడుతున్నాయని అన్నారు. సీబీ సీఐడీ, ఏసీబీ.. విచారణ జరిపితే సాక్ష్యాధారాలు లేవంటారని, అందుకే సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నామని చెప్పారు లోకేష్. మరోసారి సీబీఐ పేరెత్తి యూటర్న్ రాజకీయాలకి పేటెంట్ మాదేనని ఒప్పుకున్నారు చినబాబు.
మొత్తమ్మీద ఈరోజు లోకేష్ మాట్లాడిన మాటలు వింటుంటే.. ఓ కమర్షియల్ హీరో చెప్పే సినిమా డైలాగులకు ఏమాత్రం తీసిపోవు. లేని గాంభీర్యం తెచ్చుకొని, కళ్లు పెద్దవి చేసి లోకేష్ మాట్లాడుతుంటే.. అరె.. ఈ మనిషి సినిమాల్లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా అని మీకు అనిపిస్తే అందులో ఎలాంటి తప్పు లేదు.