ఎట్టకేలకు మాజీమంత్రి నారాలోకేష్ కి జనాల్లో తిరిగేందుకు ఓ సాకు దొరికింది. గోదావరి వరద పోటుతో ముంపుకి గురైన గ్రామాల్లో చొక్కా ఇస్త్రీ మడత నలగకుండా పర్యటన చేసి వచ్చారు లోకేష్. ఇక చూసుకోండి పచ్చమీడియా.. చినబాబు పర్యటన అంటూ హోరెత్తించింది. మొల లోతు నీళ్లలో లోకేష్ పర్యటన అంటూ ఊదరగొట్టింది. లోకేష్ వరి నాట్లను పరిశీలిస్తున్న ఫొటోలను హైలెట్ చేస్తూ కథనాలు వండి వార్చింది.
స్థానిక నాయకులు, కార్యకర్తలతో జిందాబాద్ లు కొట్టించుకుని తెగమురిసిపోయారు లోకేష్. ఓ పసిపాపను ఎత్తుకున్నారు కానీ, ఆ అమ్మాయి ఏడుపు లంకించుకోవడంతో వెంటనే తల్లికి ఇచ్చేశారు. మీ నాన్న ఉన్నప్పుడే బాగుండేదయ్యా.. ఇప్పుడు వరదలొచ్చినా ఎవరూ పలకరించడంలేదంటూ ముందుగానే రెడీచేసిన స్క్రిప్ట్ ప్రకారం కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ లు చెప్పిన డైలాగుల్ని విని లోకేష్ సంతోషపడ్డారు.
ఇంతాచేసి అక్కడ చినబాబు మీడియాతో ఏమైనా మాట్లాడారా అంటే అదీలేదు. తీరిగ్గా ఇంటికొచ్చి ట్విట్టర్ ఓపెన్ చేసి నాలుగు డైలాగులు పేల్చారు. అక్కడే చినబాబు బుక్కయ్యారు. కొత్త ప్రభుత్వం విధానాల వల్లే పంటచేలన్నీ ముంపుకి గురవుతున్నాయని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు లోకేష్. సరైన టైమ్ కి పూడిక తీయకపోవడం వల్ల కాల్వల్లో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి పంట పొలాలు మునిగిపోయాయని తేల్చిచెప్పారు.
గోదావరి పోటెత్తితే పిల్ల కాల్వలు ఆపుతాయా.. పోనీ పూడిక వల్లే పొలాలు మునిగాయి అనుకుందాం.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కొత్త ప్రభుత్వం ఈ పని చేస్తుందా? పోనీ చేయలేదనుకుందాం. గత ప్రభుత్వం చేసిందేంటి? ఈ తప్పు టీడీపీది కాదా? అప్పటి నిర్లక్ష్యమే ఇప్పుడు రైతులకు శాపంగా మారింది కదా? ఇవన్నీ లోకేష్ కి సోషల్ మీడియాలో ఎదురవుతున్న ప్రశ్నలు.
ఎరక్కపోయి వైసీపీని విమర్శించి ఇరుక్కుపోయాడు లోకేష్. ఐదేళ్ల తమ పాపాలన్నిటినీ రెండునెలల కొత్త ప్రభుత్వంపై రుద్దాలంటే అది ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినంత ఈజీ కాదు. ఇన్నాళ్లకు వరద సాకుతో జనాల్లోకి వచ్చిన లోకేష్ కి ట్విట్టర్ లో మాత్రం ట్రోలింగ్ బాధ తప్పలేదు.