చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ పనికిరారు అని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా పల్నాడు గొడవతో ఇది మరోసారి టీడీపీ నేతలకు, ప్రజలకు కూడా నిర్థారణ అయింది. ఈ ఆందోళనల్లో లోకేష్ ప్రవర్తించిన తీరుతో సొంత పార్టీ నేతలే విస్తుపోయారు. ఆయన నిదానం, నిమ్మళం చూసి తలలు పట్టుకున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన చేపట్టారు, పోలీసులు అడ్డుకుంటున్నా ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అవసరమైతే ఓ మాట అనాలి, నాలుగు మాటలుపడాలి, రెచ్చిపోవాలి, రెచ్చగొట్టాలి. సహజంగా రాజకీయ నేతలు ఇలాంటి ఆందోళనలను తమ మైలేజీ పెంచుకోవడానికి వాడుకుంటుంటారు. కానీ లోకేష్ మాత్రం సగటు జూనియర్ ఆర్టిస్ట్ లా మిగిలిపోయారు. గొడవతో తనకేం సంబంధం లేదంటూ నలుగురిలో ఒకడిగా మారిపోయారు. ముందుండి అందర్నీ నడపాల్సిన నాయకుడు, తానూ అందరిలో కలసిపోయి మౌనమునిలా మాట్లాడారు.
తప్పు తనవైపున్నా పోలీసులతో తీవ్రంగా వాదించి భూమా అఖిలప్రియ నిన్నటి రోజున బాగా హైలెట్ అయ్యారు. రాష్ట్ర టీడీపీ యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా తనవంతు పాత్ర పోషించి అరెస్ట్ అయ్యి స్థానికంగా మైలేజీ తెచ్చుకున్నాడు. మరీ అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిలా అధికారులపై నోరు పారేసుకోమని ఎవరూ చెప్పరు కానీ, కనీసం తాము చేస్తుంది నిరసనా లేక శాంతియుత ప్రదర్శనా తెలుసుకోలేని స్థితిలో లోకేష్ ఉన్నారంటే, భవిష్యత్ లో టీడీపీ ఆయన చేతుల్లోకి వెళ్తే పరిస్థితి ఎంత దిగజారుతుంతో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
లోకేష్ నాయకుడైతే టీడీపీలో మిగిలేది అంతా తాలు సరుకే. ఇప్పటికే లోకేష్ లాంటి వ్యక్తి కింద తాము పనిచేయలేమంటూ సీనియర్లు పలుమార్లు చంద్రబాబు దగ్గర ఏకాంతంగా మొరపెట్టుకున్న సందర్భాలున్నాయి. ఇప్పటికీ చినబాబులో మార్పు రాకపోతే పార్టీని కాపాడుకోవడం చంద్రబాబుకి తలకు మించిన భారంలా మారుతుంది. ట్విట్టర్ చాటున బ్రాయిలర్ కోడిలా పెరిగిన నారాలోకేష్ పందానికి పనికిరాని పుంజులా మారిపోయారు.