అసలే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చేతిలో రాజకీయంగా చావు దెబ్బ తిన్న తండ్రీకొడుకులకు , పంచాయతీ ఎన్నికల ఫలితాలు మరోషాక్ ఇచ్చాయి. దీంతో మాటలపై నియంత్రణ కోల్పోతున్నారు. స్థాయి మరిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తండ్రీకొడుకులు అవాకులు చెవాకులు పేలుతున్నారనే విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో ట్విటర్ దిగి కృష్ణా జిల్లాలో నిన్న నారా లోకేశ్ పర్యటించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు మరో రెండు గ్రామాల్లో పార్టీకి చెందిన నాయకులను, వారి కుటుంబాలను లోకేశ్ పరామర్శించారు.
అనంతరం గొల్లమందలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో బయట పడిందన్నారు. జగన్‌రెడ్డి పిల్లి… చంద్రబాబు పులి అని తేలిందన్నారు. 151 సీట్లు గెలిచామని చెప్పుకునే జగన్‌రెడ్డి … పంచాయతీ ఎన్నికలనగానే తొలుత తోక ముడిచారన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పిరికోడని ఘాటు విమర్శ చేశారు. పిరికోడు కనుకనే ఈ రోజు ప్రజల్ని భయపెట్టిస్తున్నాడని విమర్శించారు. వాళ్ల నాయకులు ఊళ్లకు వచ్చి ఏం చెబుతున్నారు… మాకు ఓటు వేయకపోతే పెన్షన్, రేషన్‌కార్డు పీకేస్తామని బెదిరిస్తున్నారన్నారు. అర్రె నీ అమ్మ, నీ అబ్బ సొత్తా ఇది అని తీవ్ర పదజాలంతో దూషించారు.
“ఇంకా మీ (వైసీపీ) భాషలో చెప్పాలంటే మీ అమ్మ మొగుడి సొత్తా ఇది” అని లోకేశ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలు చివరికి చంద్రబాబు భగవద్గీతగా చెప్పుకునే సొంత పత్రికలో కూడా అచ్చుకు నోచుకోకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్‌పై మీడియాలో బీప్ వేసే కామెంట్స్‌పై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందోననే ఆసక్తి నెలకుంది.