భీమిరెడ్డి శ్రీసుధ సినిమా నటిగా కంటే వివాదాస్పద అంశం ద్వారానే గుర్తింపు పొందారు. తాజాగా మరోసారి ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ సారి ఆమె విజయవాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి రాత్రి వేళ వెళ్లారు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్ళపాటు కాపురం చేసి మోసం చేశాడంటూ గతంలో హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ కేసులో అనేక మలుపులు తిరిగాయి.
ఇక ప్రస్తుతానికి వస్తే అదే కేసు విషయమై, తనను వెంబడించి బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆమె విజయవాడ పోలీసులకు నిన్న రాత్రి ఫిర్యాదు చేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
హైదరాబాద్ మదీనగూడలో నటి భీమిరెడ్డి శ్రీసుధ నివాసం ఉంటున్నారు. ఆమె తల్లితండ్రులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. తల్లితండ్రులను చూసేందుకు ఆమె ఈ నెల 24న హైదరాబాద్ నుంచి ఒంటరిగా కారు నడుపుకుంటూ బయల్దేరారు. అర్ధరాత్రి 12.36 గంటల సమయానికి విజయవాడ సమీపంలోని గుంటుపల్లి వద్దకు చేరుకున్నారు.
మరో కారులో వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమె కారుకు దారి ఇవ్వకుండా అడ్డగిస్తూ వచ్చారు. భవానీపురం కనకదుర్గ పైవంతెన వద్దకు వచ్చే సరికి ఆమె తన కారు నిలిపారు. అప్పుడు కారు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇనుప రాడ్డుతో ఆమెని బెదిరించాడు. దీంతో ఆమె భయాందోళనకు గురై తన కారు ఎక్కి బయలు దేరారు. పైవంతెనపై కొంత దూరం ఆమె కారును వెంబడించిన సదరు వ్యక్తులు మధ్యలో ఆగిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె భవానీపురం పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు.
గతంలో తాను శ్యామ్ కె నాయుడు, చోటా కె నాయుడు మీద హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, కొన్నాళ్లుగా రాజీ పడాల్సిందిగా వారు ఒత్తిడి తెస్తున్నారని శ్రీసుధ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజాగా తనను వెంబడించడంతో పాటు బెదిరింపులకు సంబంధించి వారిపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కాగా తనను రాడ్‌తో బెదిరించిన వ్యక్తి ఫొటోను సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి, పోలీసులకు అందించారు. తనకు న్యాయం చేయాలని సీఐ మురళీకృష్ణను ఆమె కోరారు. దర్యాప్తు చేపట్టి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని సీఐ చెప్పారు.