ముద్దపప్పు కంటే అమూల్ బేబీయే మేలు

కేంద్ర రాజకీయాల్లో రాహుల్ ని అందరూ అమూల్ బేబీగా వర్ణిస్తారు. రాజకీయాల్లో పసివాడని, ఇంకా ఏమీ తెలియదని, వయసుకి, అవసరానికి మించి బిల్డప్ ఇస్తుంటారని విమర్శిస్తారు. అమూల్ బేబీ రాజకీయాలకు పనికిరాడని మోడీ బ్యాచ్…

కేంద్ర రాజకీయాల్లో రాహుల్ ని అందరూ అమూల్ బేబీగా వర్ణిస్తారు. రాజకీయాల్లో పసివాడని, ఇంకా ఏమీ తెలియదని, వయసుకి, అవసరానికి మించి బిల్డప్ ఇస్తుంటారని విమర్శిస్తారు. అమూల్ బేబీ రాజకీయాలకు పనికిరాడని మోడీ బ్యాచ్ తీసిపారేస్తుంది. సరిగ్గా ఏపీలో కూడా అదే పరిస్థితి. నారా లోకేష్ ని ఏకంగా ముద్దపప్పు అని వైసీపీ విమర్శిస్తుంది.

చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకోడానికి వచ్చి పూర్తిగా విఫలమైన నేతలుగా అక్కడ రాహుల్ గాంధీ, ఇక్కడ లోకేష్ నిలుస్తారు. చేతిలో స్క్రిప్ట్ పెట్టి మైక్ ముందు చదవమని చెప్పినా ఇద్దరూ నీళ్లు నములుతారే తప్ప సరిగ్గా మాట్లాడ్డం చేతకాదు. తండ్రి, తాతముత్తాతలు ప్రధానులుగా పని చేసినా, రాహుల్ ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. తండ్రి, తాత ముఖ్యమంత్రులుగా చేసినా ఆ వారసత్వం లోకేష్ కి రాలేదు.

కానీ ఓ విషయంలో మాత్రం అమూల్ బేబీయే ముద్దపప్పు కంటే కాస్త మేలని అనిపించుకుంటారు. కరోనా కష్టకాలంలో అదే పనిగా ప్రభుత్వంపై సూటిగా విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. వలస కూలీల కష్టాలు వినడంలో కేంద్ర విఫలమైందని ఉదాహరణలతో సహా నిరూపించారు. రోడ్డుపై నడుస్తున్న కూలీల వద్దకు వెళ్లి, వారితో మాట్లాడి హీరో అయ్యారు. మరోవైపు కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థికసాయం అపహాస్యం కావడంతో.. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు రాహుల్ రూపంలో ఓ వేగుచుక్క కనపడినట్టయింది. రాహుల్, మోడీని పోల్చి చూస్తూ జాతీయ మీడియాలోని ఓ వర్గం బీజేపీని చీల్చి చెండాడుతోంది.

మరిక్కడ పరిస్థితి ఏంటి? నారా లోకేష్ ఇల్లు దాటి బైటకు రావడంలేదు, ఎంతసేపు ట్విట్టర్ తో కాలక్షేపం చేస్తున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేసులకు సైతం వెరవకుండా ప్రజల్లో ఉంటూ వలస కార్మికులకు, స్థానికులకు సాయం చేస్తుంటే కనీసం లోకేష్ సొంత రాష్ట్రానికి వచ్చే ధైర్యం చేయడం లేదు. పొరుగు రాష్ట్రంలో ఉంటూ.. ఇక్కడి సేవా కార్యక్రమాల్ని విమర్శిస్తున్నారు. కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టే వరకు తండ్రీకొడుకులిద్దరూ ఏపీకి రారేమోనంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

పోనీ వయసు రీత్యా చంద్రబాబు బైటకు రాకపోతే, లోకేష్ జనంలోకి వచ్చి టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయొచ్చుకదా. పేదలకు అండగా నిలబడొచ్చు కదా. లాక్ డౌన్ టైమ్ ని సరిగ్గా వాడుకుని ఉంటే.. నారా లోకేష్ ప్రజల మనిషిగా నిరూపించుకునేవారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు. కానీ చినబాబు ఏసీ గదుల్లో రాజకీయానికి అలవాటు పడ్డారు కదా. అందుకే చల్లగా ఇంటిపట్టునే ఉంటూ కాలు నేల మీద పెట్టనంటున్నారు.

అలా ఈ కరోనా కష్ట కాలంలో ధైర్యం చేసి అమూల్ బేబీ బైటకొస్తే.. మన ముద్దపప్పు మాత్రం ఇంటికే పరిమితమైపోయారు. 

మ‌డ అడ‌వుల అస‌లు చ‌రిత్ర‌

మత్తులో మత్తు డాక్టర్/నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అసలు రూపం