నారా లోకేష్ అనబడే టీడీపీ వారసత్వ సంపద.. కేవలం ట్విట్టర్ కే పరిమితం అనుకున్నారంతా. ఆ తర్వాత ఆయన జనాల్లోకి వచ్చి నానా హడావిడి చేయడం మొదలు పెట్టారు. ఆమధ్య కాసేపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాక.. అప్పటినుంచి తిరిగి మళ్లీ పరామర్శల పేరుతో జనాల్లోకి రాలేదు.
ఇటీవల కరెంటు చార్జీల పెంపు అంటూ సీఎంకు లేఖాస్త్రాలు సంధించి ఊరుకున్నారు. అసలింతకీ లోకేష్ టార్గెట్ ఏంటి..? తండ్రి తర్వాత వారసత్వంగా కాకుండా, సొంత టాలెంట్ తో ఆ స్థానాన్ని అందుకోవాలనుకుంటున్నారా.. లేదా..? లేక పవన్ కల్యాణ్ లాగా సీజనల్ పొలిటీషియన్ కావాలనుకుంటున్నారా..?
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కి సీజనల్ పొలిటీషియన్ అనే పేరుంది. మూడుంటే పిడికిలి బిగించి రోడ్డుపైకి వస్తారు, ఆ వేడి చల్లారితే ఎంచక్కా మొహానికి మేకప్ వేసుకుని షూటింగ్ స్పాట్ లోకి వెళ్తారు. సినీ నటుడిగా ఆయనకి ఆ వెసులుబాటు ఉంది. అందుకే ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, సీజనల్ పొలిటీషియన్ అయ్యారు. ఇప్పుడు పవన్ ని లోకేష్ ఫాలో అవుతున్నట్టుంది.
ఆవేశం వచ్చినప్పుడు జనాల్లోకి రావడం, అవసరం ఉన్నా లేకపోయినా పరామర్శల పేరుతో హడావిడి చేయడం లోకేష్ కి అలవాటైంది. ఆ ఆవేశం చల్లారాక ట్విట్టర్లో కాలక్షేపం చేస్తారు. ఇటీవల లోకేష్ ట్విట్టర్ హడావిడి కూడా బాగా తగ్గినట్టు కనిపిస్తోంది. కరెంటు చార్జీల పెంపుపై సీఎం జగన్ కి లేఖలు రాసి సైలెంట్ అయ్యారు లోకేష్.
అయోమయంలో చినబాబు..
పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది, బద్వేల్ లో ఉప ఎన్నికలున్నా పరువు దక్కించుకోవడం కోసం చంద్రబాబు వాటిల్ని కాదనుకున్నారు. ఈ దశలో లోకేష్ కి అసలు ఏం చేయాలో అర్థం కావడంలేదు.
ఒకటి రెండు సార్లు జనాల్లోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదని తేలిపోయింది. పైగా సీనియర్లంతా తండ్రినే మరోసారి ప్రచార రథసారధిగా ఉంచి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో.. లోకేష్ సందిగ్ధంలో పడ్డారని తెలుస్తోంది. తండ్రి వ్యూహాలను అర్థం చేసుకోలేరు, జగన్ వ్యూహాలను అంచనా వేసే సత్తా ఆయనకింకా రాలేదు.
అందుకే బుద్ధిగా సైలెంట్ అయిపోయారు లోకేష్. పవన్ కల్యాణ్ లాగే మూడ్ ని బట్టి పాలిటిక్స్ అనుకుంటూ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. సీజనల్ పొలిటీషియన్స్ లిస్ట్ లో తన పేరు కూడా నమోదు చేసుకున్నారు.