ఆమధ్య లోకేష్ ఏం మాట్లాడినా ఆయన నోటి వెంట జైలు అనే పదం వినిపించేది. అవసరమైతే జైలుకెళ్లడానికైనా సిద్ధం, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ బీరాలు పలికేవారు లోకేష్. అయితే ఆయన మాటతీరుకు, రాజకీయంగా ఆయన స్థాయికి అవి చాలా పెద్ద డైలాగులు కావడం, తీవ్రస్థాయిలో విమర్శలు, కామెడీ ట్రోలింగ్స్ జరగడంతో లోకేష్ వెనక్కి తగ్గారు. అరెస్ట్ చేయాలంటూ చిన్నపిల్లాడిలా మారాం చేయడం ఆపేశారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ అందుకున్నారు. లోకేష్ వదిలేసిన 'అరెస్ట్ రాజకీయాన్ని' జనసేనాని తగులుకున్నారు.
ఇద్దరికీ ఒకటే ఆరాటం..?
జైలుకెళ్లడం, అరెస్ట్ కావడం, విడుదలయ్యే సందర్భంలో వీర విహారాలు చేయడం, మందీమార్బలంతో ఊరేగడం.. ఇదంతా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కాదు. జగన్ ని ఆర్థిక నేరాల్లో పక్కాగా ఇరికించారనే విషయం అప్పట్లో జనాలందరికీ తెలుసు కాబట్టి ఆయనపై సింపతీ పెరిగింది. ఇప్పటికీ ఒక్క కేసులో కూడా జగన్ ని దోషిగా నిరూపించలేకపోయారు కాబట్టి ఆ కేసుల పర్యవసానాలేంటో, వాటి వెనక పరమార్థం ఏంటో కూడా అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు లోకేష్, పవన్ కోరుకుంటోంది వేరు. అరెస్ట్ అయితే జనంలో సింపతీ వస్తుందనేది వీరి ఆలోచన. సింపతీతో సీఎం కుర్చీ కొట్టేయడం ఎంత కష్టమో.. వరుస శిక్షలతో జైళ్లలో మగ్గిపోతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ని, ఆయన వారసుల్ని అడిగితే తెలుస్తుంది. అయితే ఇక్కడ పవన్, లోకేష్ కోరుకుంటుంది వేరే.
జగన్ తమపై కక్షకట్టి, తమని తట్టుకోలేక జైలులో వేయించారు అని జనం అనుకోవాలి. దాని కోసమే వీరి తాపత్రయమంతా. కనీసం పట్టాభికి వచ్చిన ఛాన్స్ తమదాకా రాకపోతుందా అని అడ్డదిడ్డమైన ప్రేలాపనలు పేలారు, పేలుతున్నారు కూడా.
అరెస్ట్ అయితే సింపతీ వస్తుందా..?
అరెస్ట్ అయితే జనం గుండెల్లో పెట్టుకుంటారు అనుకుంటే అచ్చెన్నాయుడిపై రాష్ట్రవ్యాప్తంగా సింపతీ పెరగాలి, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్ వంటి వారు జనాల్లో హీరోలు అయి ఉండాలి. కానీ అవేవీ జరగలేదు. పట్టాభి కూడా తన నోటి దురుసు వల్ల అరెస్ట్ అయ్యారనుకున్నారు కానీ, చివర్లో ఆయన ఆడిన ఇండిపై దాడి అనే నాటకం రక్తి కట్టలేదు. మరి లోకేష్, పవన్ ఈ జైలు ఎపిసోడ్ తమకెలా కలిసొస్తుందనుకున్నారో వారికే తెలియాలి.
లోకేష్ ఇప్పటికే తేరుకున్నా పవన్ తాజాగా తన ప్రసంగాలన్నిటిలో ధిక్కార స్వరం వినిపించడం, పదే పదే ప్రభుత్వాన్ని తప్పుబట్టడం, జీవో కాపీల్ని చించేస్తున్నానంటూ కాలరెగరేయడం చేస్తున్నారు. తన పర్యటనల్లో ఇప్పటికే చిత్ర విచిత్రమైన ఫొటోషూట్లతో జనాన్ని ఆకట్టుకుంటున్న పవన్.. జైలు ఎపిసోడ్ అంటూ మొదలైతే.. మరింతగా ఆ ఫొటోషూట్లను రక్తి కట్టించే అవకాశముంది.
జైలులోనే త్రివిక్రమంగా.. ఏదో ఒక పుస్తకాన్ని రాసి బయటకొచ్చాక దాన్ని పబ్లిష్ చేసే ఆశ కూడా ఆయనకి ఉండే ఉంటుంది. ఇంత ప్లానింగ్ లో ఉన్నారు కాబట్టే పవన్ ఆ ఎపిసోడ్ కోసం అర్రులు చాస్తున్నట్టుంది. సినిమాల్లో కూడా పెద్దగా జైలు ఎపిసోడ్ చేయని పవన్ కి.. ఏపీ పొలిటికల్ సీన్ లో ఆ ఆఫర్ దక్కుతుందో లేదో చూడాలి.