సమాజం మారాలి, పార్టీలో ప్రక్షాళన జరగాలి… మార్పు గురించి ఇలా పెద్దపెద్ద ఉపన్యాసాలు వింటుంటాం. కానీ మార్పు మన నుంచే ప్రారంభం కావాలని మహనీయులు చెప్పేమాట. చంద్రబాబు మాత్రం అందరూ మారాలని లేదంటే తానే మార్చేస్తానని తరచూ హెచ్చరిస్తూ వుంటారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు టీడీపీకి చావుబతుకుల సమస్య కావడంతో రెండున్నరేళ్ల ముందుగానే ఆయన అప్రమత్తమయ్యారు.
ఇప్పటి నుంచే టీడీపీ శ్రేణుల్ని ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్లేందుకు ఆయన సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు కఠినంగా మాట్లాడారు. పని చేయని వాళ్లుంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. అయితే ఇది తన కుమారుడికి వర్తిస్తుందా? అని టీడీపీకి చెందిన కొందరు నేతలు ప్రశ్నిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘ప్రతిపక్షంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. ఇప్పటికీ కదలని నాయకులను ఇక పార్టీ మోయలేదు. కొన్ని చోట్ల నాయకులు బయటకు రావడం లేదు. ఇక మీదట వేచి చూడడానికి పార్టీ సిద్ధంగా లేదు. పనిచేయని వారిని భరించాల్సిన అవసరం పార్టీకి లేదు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడేది లేదు’ అని బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ముందు తన ఇంట్లోనే మార్పు తీసుకొస్తే బాగుంటుందనేది టీడీపీ శ్రేణుల అభిప్రాయం. టీడీపీ భవిష్యత్ సారథిగా చెప్పుకునే నారా లోకేశ్ ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ట్వీట్లు చేయడం మినహా ఆయన ఎప్పుడైనా ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన ఉదంతాలు ఉన్నాయా? అని నిలదీస్తున్నారు.
ఒకవైపు టీడీపీ రోజురోజుకూ కుదేలవుతుంటే… నారా లోకేశ్ మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని మండిపడుతున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిలాగా, టీడీపీ తగలబడుతుంటే లోకేశ్ ట్వీట్లతో ఆడుకోవడం నిజం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. కావున ముందు తన కుమారుడిని యుద్ధానికి సిద్ధం చేయడమే లేక పక్కకు తప్పించడమే చేస్తే… అన్నీ చక్కబడుతాయని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.