మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బీద అరుపులు నవ్వు తెప్పిస్తున్నాయి. అధికారం పోయిన తర్వాత ఏం చెప్పినా జనాలు నమ్ముతారని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. తన పార్టీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు కామెడీ పండిస్తు న్నారు. వైసీపీది ధనబలమని, తమది జనబలం ఉన్న పార్టీగా ఆయన చెప్పుకోవడం విడ్డూరం. పార్టీ ఆర్థిక పరిస్థితి గురించి బాబు చెప్పిన నేపథ్యంలో ఏడీఆర్ నివేదికలను నెటిజన్లు తెరపైకి తెచ్చి, చీవాట్లు పెడుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆన్‌లైన్‌లో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘వైసీపీ దగ్గర డబ్బు, అధికారం ఉంటే.. మన పట్ల ప్రజల్లో నమ్మకం ఉంది. ప్రజా బలం ఉంది. అదే మన పెట్టుబడి. ప్రజల్లో నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాలి. దూరమైన వర్గాలను దరి చేర్చుకోవాలి’ అన్నారు.
టీడీపీ పేదల పార్టీగా సానుభూతి పొందాలనే తాపత్రయం కామెడీ కాక మరేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశంలో టాప్-1- ధనిక ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీలు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏడీఆర్ నివేదిక ప్రకారంలో టీడీపీ రూ.193 కోట్ల ఆస్తులతో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. టీఆర్ఎస్ రూ.188 కోట్లతో ఆరోస్థానంలో, వైసీపీ రూ.93 కోట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి.
1983 నుంచి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించిన పార్టీగా టీడీపీ ఖ్యాతి గడించింది. ఇక ఆ పార్టీకి, పార్టీ నేతలకు ఆస్తులు తక్కువేముంది? అంతెందుకు రెండెకరాల ఆసామి ఇవాళ వేల కోట్లకు పడలెత్తిన పెద్ద మనిషి కూడా పేదలు, ప్రజలు అని మాట్లాడుతున్నారంటే… ఎవరి కోసం, ఎందుకోసం ఈ మాటలో అర్థం కాని పరిస్థితిలో సమాజం ఉందా? ఇలాంటి మాటలు వింటే నవ్వుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు.
ఇప్పటికైనా కనీసం నిజాలు మాట్లాడకపోయినా, అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నాలు మానుకుంటే చంద్రబాబుకు గౌరవం దక్కుతుంది.