కరోనా సెకెండ్ వేవ్ లో తగ్గుదల నమోదయ్యాకా.. అతి తక్కువ శాతం తగ్గుదల నమోదైనది గత వారంలోనే. గత వారంలో సగటున రోజుకు 40 వేల స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అంతకు ముందువారంలో నమోదైన రోజువారీ సగటు 43 వేల కేసులు. మే రెండో వారం నుంచి ఏ రోజుకారోజు కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. జూన్ నెలాఖరుకు పూర్తిగా తగ్గిపోతుందనుకున్న సెకెండ్ వేవ్ జూలై రెండో వారానికి స్టడీగా కొనసాగుతూ ఉంది.
సెకెండ్ వేవ్ లో అతి పరిమితమైన స్థాయిలో తగ్గుదల నమోదైనది గత వారంలోనే. ఈ నేపథ్యంలో ఈ వారంలో పరిస్థితి ఎలా ఉంటుందనేది కోవిడ్ తదుపరి పరిస్థితి గురించి క్లారిటీ ఇవ్వనుంది. సోమవారం రోజున దాదాపు 37 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వారంలో రోజువారీ కేసుల సగటు ఏ స్థాయిలో ఉంటుందనేది తదుపరి పరిస్థితిపై క్లారిటీని ఇవ్వొచ్చు. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్యలో తగ్గుదల మెరుగైన స్థాయిలో ఉంటే… సెకెండ్ వేవ్ తగ్గుముఖం కొనసాగుతున్నట్టే.
ప్రత్యేకించి కేరళ, మహారాష్ట్రల్లో కేసుల నమోదు తీవ్రత స్టడీగా కొనసాగుతూ ఉండటమే మొత్తం కేసుల నంబర్ ను స్టడీగా ఉంచుతోంది. సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం కేరళలో 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు ఆ కేసులతో సమానమైన స్థాయిలోనే ఉన్నా, ఇప్పుడు దేశ వ్యాప్తంగా వస్తున్న మొత్తం కేసుల్లో 50 శాతానికి పైగా ఆ రెండు రాష్ట్రాల్లోనే రికార్డవుతున్నాయి.
మరోవైపు ఉత్తరాదిన మళ్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఊపందుకోనున్నాయట. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ల నుంచి కోట్ల మంది భక్తులు ఒక తీర్థయాత్ర చేపట్టనున్నారట. ఆ తీర్థయాత్రకు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి పర్మిషన్ ను రద్దు చేయగా, కొత్త ముఖ్యమంత్రి ఆ పర్మిషన్ ను ఇచ్చేశారట.
కుంభమేళా సమయంలో తప్పుడు కోవిడ్ టెస్టుల లెక్కలు చెప్పారనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఒక భారీ తీర్థయాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఇది ఏ పరిణామాలకు కారణమవుతుందో!