తమలో తమకు నీతులు చెప్పుకోవడంలో సినిమా వాళ్లు తమ నటనా ప్రావీణ్యాన్ని అంతా ప్రదర్శిస్తున్నారు! ఒకరని కాదు.. అందరూ అందరే! అన్నట్టుగా తయారైంది వ్యవహారం. నువ్వు ఎందుకు మాట్లాడావ్? అంటే.. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ అన్నట్టుగా మారింది వ్యవహారం! ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ప్రదర్శన పెట్టాడంటూ.. నరేష్ తన ప్యానల్ తో రంగంలోకి దిగిపోయారు!
అప్పుడే ఏం తొందర? అని ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించారు నరేష్. మా ప్రెసిడెంట్ హోదాలోని తను నోటిఫికేషన్ ఇవ్వనిది ఎన్నికలు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. అయితే గత ఎన్నికల సమయంలో తనతో పాటు గెలిచిన తన ప్యానల్ సభ్యులే ఇప్పుడు ప్రకాష్ రాజ్ వెంట ఉన్నారని నరేష్ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒక రకంగా ఇది ఆయనపై అవిశ్వాస తీర్మానం లాంటిదేమో!
కామెడీ ఏమిటంటే.. ఒకరికి మరొకరు భలే పాఠాలు చెబుతున్నారు, నీతులు వల్లె వేస్తున్నారు. పాత ప్యానల్ కు కొత్త ప్యానల్ పాఠాలు చెబుతుంటే, కొత్త ప్యానల్ కు పాత ప్యానల్ చెబుతోంది. ఇప్పుడే కాదు.. గత కొన్నేళ్లుగా 'మా' గొడవలన్నీ ఇదే తరహాలో ఉన్నాయి. గత ఏడాది న్యూ ఇయర్ క్యాలెండరో, డైరీ ఆవిష్కరణ సభలోనో రాజశేఖర్ బాహాటంగా చేసిన రచ్చ మా లోని పరిస్థితిని అందరికీ చాటి చెప్పింది.
తామంతా ఒకటేనని, తమదంతా ఒక కుటుంబం అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారు సినీ నటులు. మళ్లీ మీడియాకు ఎక్కి రచ్చ చేసుకునేదీ వాళ్లే! 50 కోట్ల రూపాయలు తమకు ఒక్క లెక్కలోనిది కాదని వారు అంటున్నారు. అయితే ప్రభుత్వమే స్థలం ఇవ్వాలని, ప్రస్తుతం సిటీలో స్థలాన్ని ప్రభుత్వం ఇవ్దని అంటారు.
ఒక్కో సినిమాకు 40, 50 కోట్ల పారితోషకం తీసుకుంటున్న సినిమా హీరోల ఆధ్వర్యంలోని సంస్థ.. చివరకు ఉచితంగానో, తక్కువ ధరకో సిటీ మధ్యలో ప్లేస్ ఇవ్వమంటూ ప్రభుత్వాలను దేబిరించడానికి మించిన దారుణం మరోటి ఉండదు.
ప్రస్తుతం మా రాజకీయంలో యాక్టివ్ గా ఉన్న వారంతా కోటిశ్వరులే. కోట్ల రూపాయల పారితోషకాలు పొందే వారే. అయితే వీళ్లు ఒక చిన్న భవనం కట్టుకోవడం గురించి సంవత్సరాలకు సంవత్సరాలుగా రచ్చ చేసుకుంటున్నారు! ఎవరికి వారు నీతులు బీభత్సంగా చెబుతున్నారు. నువ్వు ఎందుకు స్పందించావ్, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావ్.. అంటూ ఒకరికొకరు హిత బోధలు చేసుకుంటున్నారు.
ఆ హితబోధల్లో మళ్లీ దెప్పి పొడుపులు, విమర్శలు కామన్. ఆఖరికి ఊరూ పేరూ ఎవరికీ తెలియని నటులు కూడా కొందరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు! భవనం ఎంత.. కోటి కావాలా, రెండు కోట్లు కావాలా.. అంటున్నారు! ఇలా సాగుతోంది మా ప్రహసనం. జనాలకు థియేటర్ సినిమా ఎంటర్ టైన్ మెంట్ లేని వేళ.. ఇలా సినిమా వాళ్లు రియాలిటీ షో తరహా వినోదాన్ని అందిస్తూ తమ పాత్రలకు న్యాయం చేస్తున్నట్టుగా ఉన్నారు.