ఏపీ ప్రభుత్వం జూన్ -20వ తేదీన ఒక్క రోజులోనే 13,72,481మందికి టీకాలు ఇచ్చి రికార్డు సృష్టించింది. ఏపీలో వయోజనుల సంఖ్య దాదాపుగా 4 కోట్లు. ఆ లెక్కన చూసుకుంటే వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే.. నెలరోజుల్లో ఏపీలో టీకా కార్యక్రమం పూర్తవుతుందనమాట. అటు కేంద్రం నుంచి వస్తున్న టీకాలు అంతంతమాత్రమే.
ఇక్కడే ఓ చిన్న మతలబు ఉంది. కేంద్రం గనక ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లను తానే నేరుగా రాష్ట్రాలకు సరఫరా చేస్తే, ఏపీలాంటి వాటికి బాగా ఉపయోగం. ఈ విషయాన్ని సీఎం జగన్, ప్రధాని మోదీకి మరోసారి లేఖ ద్వారా తెలియజేశారు. ప్రైవేటుకి కేటాయించిన వ్యాక్సిన్లను, ఏపీకి కేటాయించాలని కోరారు.
భారత్ లో తయారయ్యే వ్యాక్సిన్లలో 75శాతాన్ని ఉత్పత్తిదారులు నేరుగా కేంద్రానికి సబ్సిడీ ధరకు ఇవ్వాలి. ప్రైవేటు ఆస్పత్రులకు 25శాతం అమ్మేలా నిల్వ చేసుకోవచ్చు. ఇదీ ప్రస్తుతం భారత్ లో ఉన్న వెసులుబాటు. అయితే కేంద్రం 75శాతం తీసుకుని రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం 25శాతం వ్యాక్సిన్ ను సకాలంలో తీసుకోలేకపోతున్నాయి. కనీసం 10శాతం కూడా ప్రైవేటు సెక్టార్ లో టీకా పంపిణీ జరగట్లేదు. మరి మిగతా 15శాతం ఏమవుతోంది.
ప్రభుత్వానికిస్తే లాభం రాదు కాబట్టి, ప్రైవేటు సెక్టారు కోసమే ఉత్పత్తిదారులు వాటిని నిల్వచేసి పెడుతున్నారు. ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు కదా అని వాటిని తమవద్దే అట్టిపెట్టుకుంటున్నారు. ఫలితంగా భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆలస్యం అవుతోంది. ఈ పద్ధతిలో మార్పు రావాలనే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. సరైన లాజిక్ తో కొట్టారు, పరోక్షంగా వ్యాక్సినేషన్లో ఏపీ టాలెంట్ ఏంటనేది దేశం మొత్తానికి అర్థమయ్యేలా చెప్పారు.
వ్యాక్సినేషన్ మోసాలకు కూడా చెక్..
కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు అందిస్తే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత స్పీడందుకుంటుంది. ఇక ప్రైవేటు ఆస్పత్రువైపు కానీ, ప్రైవేటు ఏజెన్సీలు పెట్టే వ్యాక్సినేషన్ డ్రైవ్ ల వైపు కానీ ప్రజలు చూసే అవకాశం ఉండదు. ఒకరకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ల పేరుతో సాగే మోసాలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది.
ఏపీలో ఈతరహా మోసాలు ఇంకా వెలుగులోకి రాలేదు కానీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రైవేటు ఏజెన్సీలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాయి. యాంటీబయోటిక్ ఇంజెక్షన్లతో మాయ చేస్తున్నాయి. ప్రభుత్వం వద్ద విరివిగా టీకాలు దొరికితే ప్రజలు ఇలా మోసాల బారినపడే అవకాశం తక్కువ. జగన్ సూచన ఈ మోసాల్ని అరికట్టేందుకు కూడా ఉపయోగపడుతుంది.