జూలై 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని సమాచారం. ఇప్పటి వరకూ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన లేకపోయినా, జూలై 19 నుంచి ఆగస్టు 13 మధ్యన పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా కేసులు మళ్లీ తీవ్రస్థాయికి చేరకపోవడం అనే అంశమే పార్లమెంట్ సమావేశాలను ప్రభావితం చేస్తుందని వేరే చెప్పనక్కర్లేదు.
జూలై 19 సమయానికి ప్రస్తుత వేవ్ పూర్తిగా సమసిపోతుందా? మరో వేవ్ తలెత్తదా? అనే అంశాలే పార్లమెంట్ సమావేశాలు జరగడాన్ని, జరగకపోవడాన్ని నిర్దేశించవచ్చు. ఆ సంగతలా ఉంటే.. పార్లమెంట్ సమావేశాల్లోపే ప్రధాన మంత్రి మోడీ తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారా, మార్పు చేర్పులు చేయనున్నారా.. అనేది ఆసక్తిదాయకంగా అంశంగా నిలుస్తోంది.
కేంద్రమంత్రి వర్గంలో మార్పుచేర్పులుంటాయని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు ప్రధానమైనవి అని అంటున్నారు. యూపీ, బిహార్ లకు సంబంధించి కుల, మత, రాజకీయ సమీకరణాల ఆధారంగా కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు జరుగుతాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ఇప్పుడు బీజేపీలో ప్రాధాన్యత లభిస్తుందని అంటున్నారు. ఈ విషయంలో జ్యోతిరాధిత్య సింధియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ను కూల్చి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సింధియాకు ఇప్పుడు కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కబోతోందని తెలుస్తోంది.
అలాగే ఇటీవలే అస్సోంలో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి సోనోవాల్ కు కూడా కేంద్రమంత్రివర్గంలో స్థానం లభించనుందట. ఈ మేరకు ఆయనకు హామీ లభించిందట. ఇటీవలే మోడీని, హోం మంత్రి అమిత్ షాను కలిశారు సోనోవాల్. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్రంమంత్రి వర్గంలో స్థానం లభించడం లాంఛనమే అంటున్నారు.
ఇక కీలకమైన మార్పులు యూపీ రాజకీయం మీదే ఆధారపడి జరగబోతున్నాయని టాక్. వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న యూపీ ఎన్నికలకు మోడీ ప్రభుత్వం చాలా కసరత్తే చేస్తోంది ఇప్పటికే. ఈ క్రమంలో అక్కడి రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసేలానే ప్రధానంగా కేంద్రమంత్రి వర్గంలో మార్పు చేర్పులు జరగనున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి జాతీయ స్థాయిలో.
మరి ఈ మార్పు చేర్పులకు మరెంతో సమయం లేదని, యూపీ ఎన్నికలకు వేగంగా సంసిద్ధం అవుతున్న బీజేపీ వీలైనంత త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని సమాచారం. బహుశా అది పార్లమెంట్ సమావేశాలకు ముందే జరగొచ్చని అంచనా.