మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌.. ఇంకా నియంత్ర‌ణ‌లోకి రాని నంబ‌ర్లు!

జూన్ నెలాఖ‌రుకు క‌రోనా సెకెండ్ వేవ్ పూర్తి స్థాయిలో నియంత్ర‌ణ‌కు వ‌స్తుంద‌ని ఇది వ‌ర‌కూ ప‌రిశోధ‌కులు అంచ‌నా వేశారు. వారి అంచ‌నాలు చాలా వ‌ర‌కూ నిజ‌మ‌వుతున్నాయి కానీ, దేశంలోని రెండు రాష్ట్రాల్లో ఇంకా క‌రోనా…

జూన్ నెలాఖ‌రుకు క‌రోనా సెకెండ్ వేవ్ పూర్తి స్థాయిలో నియంత్ర‌ణ‌కు వ‌స్తుంద‌ని ఇది వ‌ర‌కూ ప‌రిశోధ‌కులు అంచ‌నా వేశారు. వారి అంచ‌నాలు చాలా వ‌ర‌కూ నిజ‌మ‌వుతున్నాయి కానీ, దేశంలోని రెండు రాష్ట్రాల్లో ఇంకా క‌రోనా సెకెండ్ వేవ్ పూర్తి స్థాయిలో నియంత్ర‌ణ‌కు రాలేద‌ని స్ప‌ష్టం అవుతోంది. 

ప్ర‌స్తుతం వ‌స్తున్న కేసుల్లో ఏకంగా 40 శాతం కేసులు రెండు రాష్ట్రాల్లోనే న‌మోద‌వుతున్నాయి.  మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌.. ఈ రెండు  రాష్ట్రాల్లోనే గ‌త కొన్నాళ్లు ఎక్కువ స్థాయి కేసులు న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి.

సెకెండ్ వేవ్ లో మ‌హారాష్ట్ర అత్య‌థిక కేసుల‌ను చ‌వి చూసింది. కేర‌ళ కూడా ఎక్కువ కేసుల‌నే న‌మోదు చేసింది. అయితే మ‌హారాష్ట్ర‌లో మ‌ర‌ణాల రేటు కూడా ఎక్కువ‌. కేర‌ళ‌లో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువ కానీ, మ‌ర‌ణాల రేటు విష‌యంలో మాత్రం నియంత్ర‌ణ న‌మోదైంది. అయితే ఇప్పుడు కేర‌ళ‌లో యాక్టివ్ కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతూ ఉంది.

దేశంలో ఒక ద‌శ‌లో 37 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం ఆ సంఖ్య ఆరు ల‌క్ష‌ల లోపుకు చేరింది. ఇది మంచి ప‌రిణామ‌మే. అయితే గ‌త రెండు రోజులుగా కేర‌ళ‌లో యాక్టివ్ కేసుల సంఖ్య‌లో స్వ‌ల్ప పెరుగుద‌ల న‌మోదైంది. దేశంలోని మొత్తం ఆరు ల‌క్ష‌ల యాక్టివ్ కేసుల్లో కేర‌ళ‌లోనే ల‌క్ష కేసులున్నాయి! మ‌హారాష్ట్ర‌లో ల‌క్షా ఇర‌వై వేల‌కు పైగా కేసులున్నాయి. క‌ర్ణాట‌క‌లో ల‌క్ష‌కు పైగా కేసులున్నా.. అక్క‌డ క్ర‌మంగా ఈ నంబ‌ర్ త‌గ్గుతోంది. దిన‌వారీ కేసులు క‌ర్ణాట‌క‌లో కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. 

ప్ర‌స్తుతం రోజువారీ కేసుల న‌మోదులో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లు ప‌ది వేల స్థాయిలో కొన‌సాగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. మిగ‌తా రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య న‌మోదు క్ర‌మంగా త‌గ్గుతున్నా.. ఈ రెండు  రాష్ట్రాల్లోనే త‌గ్గుద‌ల స్థాయి మెరుగ్గా లేదు!

ప్ర‌త్యేకించి గ‌త వారం రోజుల నుంచి మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ కేసుల సంఖ్య‌లో స్వ‌ల్ప పెరుగుద‌ల చోటు చేసుకోవ‌డం, ఆ త‌ర్వాత కొంత త‌గ్గ‌డం, మ‌ళ్లీ పెర‌గ‌డం జ‌రుగుతూ ఉంది! ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లు ఈ అంశం పై సీరియ‌స్ గా దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తూ ఉంది. లేక‌పోతే.. మ‌ళ్లీ దేశం మొత్తాన్నీ ఇవి ఇబ్బంది పెట్టే అవ‌కాశాలు ఉంటాయేమో!