కరోనా/లాక్ డౌన్ వల్ల విద్యా సంవత్సరం వృథా అవుతోంది. ఒక జనరేషన్ ఏడాది పాటు పుస్తకాలకు దూరంగా ఉంటే.. దానివల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువ. అందుకే ముందు చూపుతో ఏపీ సీఎం జగన్ పాఠశాలల పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పొరుగు రాష్ట్రాల్లో కదలిక లేకపోయినా జగన్ ఆ సాహసం చేశారు. స్కూళ్లు తెరిచే ముందే ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో కొవిడ్ పరీక్షలు జరిపారు, విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చినవారికి హోమ్ క్వారంటైన్ సిఫార్సు చేసి యథావిధిగా స్కూల్స్ మొదలుపెట్టారు.
ఇక్కడే ప్రతిపక్షాలు విమర్శలకు పదునుపెట్టాయి. స్కూళ్లు తెరిచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అని ప్రశ్నించాయి. హాజరు తప్పనిసరి కాదని ప్రభుత్వం వివరణ ఇస్తున్నా కూడా విపక్షాల రాద్ధాంతం శృతి మించుతోంది. అయితే వీళ్ల విమర్శలకు జగన్ సర్కార్ సమాధానం ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఆ సమాధానాన్ని ఇప్పుడు ఇతర రాష్ట్రాలు ఇస్తున్నాయి.
పాఠశాలల విషయంలో ఇతర రాష్ట్రాలు కూడా సీఎం జగన్ ని అనుసరించడం మొదలు పెట్టాయి. కేసుల ఉధృతిలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న మహారాష్ట్రలో ఈ నెలలోనే పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన నిర్ణయాన్ని ప్రకటించారు కూడా.
విచిత్రం ఏంటంటే.. కరోనా కేసులు తగ్గుతున్నా కూడా మహారాష్ట్రలో దేవాలయాలు తెరిచేందుకు ఉద్ధవ్ నిరాకరించారు. గవర్నర్ వెటకారంగా మాట్లాడినా కూడా ఉద్ధవ్ తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడ్డారు.
అలాంటి ఉద్ధవ్ ఇప్పుడు దేవాలయాలు, పాఠశాలల్ని తిరిగి తెరిచేందుకు సిద్ధపడ్డారు. దీపావళి తర్వాత యధావిధిగా కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. అంటే గుడి గంట కంటే బడిగంటే మేలని నమ్మే ముఖ్యమంత్రుల్లో ఉద్ధవ్ కూడా చేరిపోయారన్నమాట.
విద్యార్థులకు ఆరోగ్యంతో పాటు భవిష్యత్ కూడా ముఖ్యమే. స్కూల్ కి వెళ్తేనే సామాజిక వ్యాప్తిని ఎలా అరికట్టాలో వారు తెలుసుకుంటారు, కరోనా జాగ్రత్తలను ఉపాధ్యాయుల వద్ద నేర్చుకుంటారనేది ఉద్ధవ్ వాదన. అయితే ఇక్కడి ప్రతిపక్షాల లాగా.. అక్కడి ప్రతిపక్షాలు వితండ వాదన చేయకపోవడం విశేషం.