మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే (60) అనారోగ్యంతో మృతిని కుటుంబ సభ్యులు నమ్మడం లేదు. ఆర్కే మృతిని మావొయిస్టులు నిర్ధారించకపోవడం పలు అనుమానాలకు తెరదీసింది.
ఆర్కే అనారోగ్యంతో మృతి చెందారని పోలీసులు మాత్రమే చెబుతున్నారు. మరోవైపు ఆర్కే మృతి చెంది ఉంటే… మావోయిస్టులు అధికారికంగా ప్రకటించి వుండేవారని ప్రముఖ విరసం నేత, ఆర్కే సడుగుడు కల్యాణ్‌రావు చెబుతున్నారు.
ఆర్కే మృతిపై ఛత్తీసగఢ్ డీజీపీ ప్రకటించాడని చానల్స్‌లో వచ్చిన వార్తలు తప్ప తమకే విషయం తెలియదని విరసం నేత కల్యాణ్‌రావు అన్నారు. ఆర్కే పనిచేస్తున్న పార్టీ నుంచి సమాచారం ఏదీ లేదన్నారు. అందుకే కచ్చితంగా ఏమీ చెప్పలేమనడం గమనార్హం.
ఆర్కే పార్టీ ప్రకటన ఇచ్చే వరకు ఆయన మరణాన్ని ధ్రువీకరించలేమని కల్యాణ్‌రావు తెలిపారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన వరకు అగ్రనేత మృతిపై కచ్చితంగా ప్రకటన వస్తుందని ఆయన అన్నారు. గతంలో అనేకసార్లు ఆర్కే మృతిపై ఇలాంటి పుకార్లే వచ్చాయనడం గమనార్హం.
ఆర్కే సోదరుడు రాధేశ్యాం కూడా అన్న మరణవార్తపై స్పందించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఉంటున్న ఆయన మీడి యాతో మాట్లాడుతూ అన్న చనిపోయిన విషయం అధికారికంగా గురువారం రాత్రి వరకు తెలియదన్నారు.
ప్రభుత్వాలు అవకాశమిస్తే ఆర్కే మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్కే మృతిని ప్రజాసంఘాలు కూడా నమ్మడం లేదు. ఆర్కే మృతిపై సమాచారం లేదని ప్రముఖ పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ అన్నారు.ఆర్కే మృతి చెంది వుంటే …ఏ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ దాచుతుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.