అనూహ్యంగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన వారు ఆ పదవికి కావాల్సిన శాసనసభ్యత్వాన్ని పరోక్ష ఎన్నికల ద్వారా కూడా పొందుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో బీజేపీ తరఫున ఇలాంటి నామినేటెడ్ సీఎంలు కొందరు తెర మీదకు వచ్చారు. అలాగే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా నెగ్గలేదు. ఆయన పోటీ కూడా చేయలేదు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాకా.. మండలిలో నామినేట్ అయ్యారు ఉద్ధవ్. తద్వారా ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతూ ఉన్నారు.
ఇక తన పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయమే సాధించినా, అనూహ్యంగా తను ఎమ్మెల్యేగా ఓడిపోయారు మమతా బెనర్జీ. అయినా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఈ నెల ఏడో తేదీన మమత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తద్వారా ఎమ్మెల్యేగా ఓడి, ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మమత.
భవానీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ ఏకంగా 58,835 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. పోల్ అయిన ఓట్లలో సగానికి పైగా ఓట్లను మమత పొందారు. మమతను ఎమ్మెల్యేగా మరోసారి ఓడించి, ఆమె సీఎం సీట్లో కొనసాగేందుకు మొహమాట పడే పరిస్థితిని తీసుకొస్తామన్న బీజేపీ ప్రతిన ఎన్నికల ఫలితాల్లో కనిపించలేదు.
అలాగే వెస్ట్ బెంగాల్ లో జరిగిన మరో రెండు అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలో కూడా టీఎంసీ జయకేతనం ఎగరేసింది. మమతతో పాటు అసెంబ్లీలో టీఎంసీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో పోటీ చేసి చిత్తైన బీజేపీకి ఈ ఉప ఎన్నికల్లో ఓటమి మరింత ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికే టీఎంసీ నుంచి బీజేపీ వైపు వలస వచ్చిన అనేక మంది నేతలు వెనుదిరిగారు. ఉప ఎన్నికల ఫలితాలతో ఇలాంటి వారి లెక్కలు మరింతగా తేలే అవకాశాలున్నాయి.