ఆ మధ్య తమిళ నటీనటుల సంఘానికి ఎన్నికలు జరిగినప్పుడు ప్రాంతీయ అంశంపై మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు తెలుగు నటీనటుల సంఘానికి జరుగుతున్న ఎన్నికల విషయంలో కూడా ప్రాంతీయత ఆధారంగా విమర్శల పర్వానికి తెరలేవడం గమనార్హం.
నటుడు ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదంటూ మరో నటుడు నరేష్ ఈ ఎన్నికల అంశంలో సూటిగా ప్రాంతీయత అంశాన్ని తెరపైకి తెచ్చాడు. మొదటి నుంచి ప్రకాష్ రాజ్ విషయంలో అంతర్లీనంగా ఈ చర్చ ఉంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని మరింతగా హైలెట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ ప్రత్యర్థులు.
ఇదంతా చూస్తే.. గతంలో విశాల్ విషయంలో ఆయన వ్యతిరేకులు తెరపైకి తెచ్చిన ప్రాంతీయత, భాష అంశం గుర్తుకు రాకమానదు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానల్ ను వ్యతిరేకించిన రాధికా శరత్ కుమార్ ప్యానల్.. విశాల్ తెలుగు వాడనే అంశాన్ని గుర్తు చేసింది. విశాల్ తెలుగు వాడు అని, విశాల్ రెడ్డి అంటూ రాధిక వర్గం నొక్కి వక్కాణించింది.
బోలెడన్ని తెలుగు సినిమాల్లో నటించిన రాధిక, తెలుగును స్పష్టంగా మాట్లాడగల రాధిక, టాలీవుడ్ లో బోలెడంత సాన్నిహిత్యాన్ని కలిగిన రాధిక.. ఆ సమయంలో సంఘంపై జారుతున్న పట్టును నిలబెట్టుకోవడానికి ప్రాంతీయత అంశాన్ని వాడుకునే ప్రయత్నం చేసింది.
రాధిక చెప్పింది అబద్ధమేమీ కాదు. ఇంట్లో తెలుగు మాట్లాడుకునే చెన్నై వాసి విశాల్. పూర్తిగా తెలుగు నేపథ్యం. అయితే.. ప్రాంతీయాభిమానం అతిగా ఉండే తమిళనాట కూడా ఇది పని చేయకపోవడం గమనార్హం. అప్పట్లో విశాల్ ప్యానల్ కు తమిళ సూపర్ స్టార్లు మద్దతు ఇచ్చారు. కమల్ హాసన్ తో సహా ప్రముఖులు విశాల్ గ్రూప్ కు మద్దతు పలికారు.
రాధా రవి, శరత్ కుమార్, రాధికలు గట్టిగానే ప్రయత్నాలు చేసినా, అప్పటికే నడిగర్ సంఘంపై వారికి పూర్తి ఆధిపత్యం ఉన్నా.. నాజర్- విశాల్ ల ప్యానల్ విజయం సాధించింది. అలా తమిళనటీనటు సంఘం ఎన్నికల్లో ప్రాంతీయత అంశం ఓడిపోయింది.
మరి ఇప్పుడు తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లోనూ మళ్లీ ప్రాంతీయత, భాష అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఏమవుతుందో ప్రాంతీయ వాదం!