Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్ర‌కాష్ రాజ్ పై మెగా ధోర‌ణిలో ఎంత మార్పో!

ప్ర‌కాష్ రాజ్ పై మెగా ధోర‌ణిలో ఎంత మార్పో!

ఒకానొక ద‌శ‌లో టాలీవుడ్ లో ప్ర‌కాష్ రాజ్ పై నిషేధం ప‌డ‌టానికి సంబంధించిన ఫిర్యాదులు చేసింది మెగా ఫ్యామిలీనే. దానికంతా కార‌ణం కూడా ఒక మెగా ఫ్యామిలీ మూవీనే. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన గుడుంబా శంక‌ర్ మూవీతో వివాదం రేగింది. 

ఆ సినిమాలో న‌టించ‌డానికి ముందుగా అంగీక‌రించిన ప్ర‌కాష్ రాజ్ ఆ త‌ర్వాత‌..  అడ్డం తిరిగిన‌ట్టుగా,  డేట్ల‌ను స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయాడో, లేక ఆ సినిమానే లైట్ తీసుకున్నాడో కానీ.. దాని నిర్మాణంపై ఆ ప్ర‌భావం ప‌డింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఫిర్యాదులు చోటు చేసుకున్నాయి. 

ఏదో చోటామోటా హీరో సినిమాతో ప్ర‌కాష్ రాజ్ అలా వ్య‌వ‌హ‌రించి ఉంటే పెద్ద సీన్ ఉండేది కాదేమో. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకే అలాంటి ఝ‌ల‌క్ ఇచ్చే స‌రికి .. ప్ర‌కాష్ రాజ్ పై అప్ర‌క‌టిత నిషేధం ఒక‌టి కొన్నాళ్ల పాటు సాగింది.

మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలో ప్ర‌కాష్ రాజ్ ను ప‌క్క‌న పెట్టారు. గుడుంబా శంక‌ర్ కు కాస్త అటు ఇటు గా రూపొందిన శంక‌ర్ దాదాలో ప్ర‌కాష్ రాజ్ కు స్థానం ద‌క్క‌లేదు. ఆ సినిమా త‌మిళ వెర్ష‌న్, తెలుగు వెర్ష‌న్ ను ఒకే సంస్థే రూపొందించింది. 

త‌మిళ వెర్ష‌న్లో ప్ర‌కాష్ రాజ్ చేసిన పాత్ర విష‌యంలో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌లేదు. హిందీ నుంచి ప‌రేష్ రావ‌ల్ ను తీసుకొచ్చి ఆ పాత్ర‌ను చేయించుకున్నారు. మ‌ధ్య‌లో అంద‌రివాడులో ప్ర‌కాష్ రాజ్ న‌టించినా, చివ‌ర‌కు ప్ర‌కాష్ రాజ్ కు చిరు, ప‌వ‌న్ ల‌తో రాజీ కుద‌ర‌డానికి చివ‌ర‌కు త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ రంగంలోకి దిగాడంటారు.

స్టాలిన్ సినిమాలో విల‌న్ పాత్ర‌కు ప్ర‌కాష్ రాజ్ కు మించిన ప్ర‌త్యామ్నాయం ల‌భించ‌లేదు మురుగ‌దాస్ కు. అయితే పాత గొడ‌వ‌తో ప్ర‌కాష్ రాజ్ ను దూరం పెడుతూ వ‌చ్చింది మెగాఫ్యామిలీ. అయితే.. మురుగ‌దాస్ చొర‌వ‌తో.. వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌చ్చింది. ప్ర‌కాష్ రాజ్ కు త‌మ సినిమాల్లో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది మెగా ఫ్యామిలీ. ఆ త‌ర్వాత చిరంజీవి, చ‌ర‌ణ్ సినిమాల్లో ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తూ వ‌చ్చాడు. వివాదం స‌మ‌సిపోయింది. 

చిత్ర‌సీమ‌లో ఇలాంటి అప్ర‌క‌టిత నిషేధాలు గ‌తంలోనూ ఉన్నాయి. కొంద‌రు స్టార్ల విష‌యంలోనే ఇలాంటివి న‌డిచాయి. అయితే గ‌త కొన్నేళ్ల‌లో చెప్పుకోద‌గిన నిషేధం ఇదే. అలాంటి వివాదంలో వినిపించిన పేర్లు..ఇప్పుడు మా ఎన్నిక‌లో నెగ్గేందుకు ఏకం కావ‌డం విశేష‌మే. 

ఒక ద‌శ‌లో ప్ర‌కాష్ రాజ్ ను తెలుగు సినిమాల్లోనే నిషేధించాలని ఫిర్యాదులు చేసిన వారు, త‌మ సినిమాల్లో అప్ర‌క‌టిత నిషేధాన్ని అమ‌లు చేసిన వారు.. ఇప్పుడు మా ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ప్రెసిడెంట్ గా చేసే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌టం విశేష‌మే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?