మెగాస్టార్…మంచి..చెడు వినిపిస్తోందా?

మంచి వుంటే మైకులో చెప్పండి..చెడు వుంటే చెవిలో చెప్పండి అంటూ మా వేదిక మీద సుద్దులు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సుద్దులు అన్నీ సీనియర్ హీరో రాజశేఖర్ కు. అప్పట్లో మోహన్ బాబు,…

మంచి వుంటే మైకులో చెప్పండి..చెడు వుంటే చెవిలో చెప్పండి అంటూ మా వేదిక మీద సుద్దులు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సుద్దులు అన్నీ సీనియర్ హీరో రాజశేఖర్ కు. అప్పట్లో మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి సీనియర్లు కూడా మెగాస్టార్ తో గొంతు కలిపారు. రాజశేఖర్ ఒంటరి అయ్యారు. ఆయనే క్రమశిక్షణ లేని మెంబర్ గా మిగిలిపోయారు.

కట్ చేస్తే..మళ్లీ మా ఎన్నికలు. హడావుడి. ఇప్పుడు సభ్యుల క్రమశిక్షణ చూస్తుంటే ముచ్చటేస్తోంది. తాట తీస్తా..తోలు వలిచేస్తా…లాంటి పదాలు వాడడం లేదు కానీ, ఆవేశ కావేషాలు చూస్తుంటే అలాగే వుంది. మెంబర్ షిప్ లు కట్టడం అన్నది ఎన్నికల్లో మామూలే.

అంతెందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికలే చూసుకుందాం. చాలా మంది సభ్యులు సభ్యత్వం బకాయి పడతారు. ఎన్నికల ముందు జాబితా పెడతారు. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్లు చాలా మంది సభ్యత్వ రుసం కట్టేస్తారు. ఇది ఎన్నాళ్ల నుంచో జరుగుతున్న తంతు.

మంచు విష్ణు కూడా ఇప్పుడు చేసింది అదే. పోస్టల్ బ్యాలట్ కు 500 ఫీజు పెట్టారు. అది తెలుసుకుని, పోస్టల్ బ్యాలట్ ల అందరి ఫీజులు ఆయన కట్టేసారు. తానే కట్టేసానని చెప్పేసారు కూడా. సరే, అది లీగల్ నా? ఇల్లీగల్ నా? అన్నది పక్కన పెడితే ఎన్నికల వ్యూహంలో అదో తంత్రం.

నైట్ పార్టీలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, ఇలా గత రెండు మూడు నెలలుగా రెండువర్గాలు చేస్తూనే వున్నాయి. ప్రకాష్ రాజ్ కూడా పూరి ఆఫీసులో ఇదే పని చేసారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మంచు విష్ణు ఏదో అన్యాయం చేసి గెలిచేస్తున్నాడు అన్నంత కలరింగ్ ఇచ్చేసారు ప్రకాష్ రాజ్.

విష్ణు కూడా తక్కువ తినలేదు. లోపల ఒరిజినల్ అలాగే వుంది అన్నట్లుగా, మాటల తూటలు విసిరారు. మరోసారి మాట తేడా వస్తే మంచు ఫ్యామిలీతో మంచిగా వుండదు అంటూ హెచ్చరించేసారు.

ఇప్పుడే చిరంజీవి అయినా కృష్ణం రాజు అయినా కలుగచేసుకోవాల్సింది. ఇరు వర్గాలను గట్టిగా హెచ్చరించాలి. నటీనటుల పరువు ప్రజల్లో పలుచన చేయవద్దని హెచ్చరించాలి. అలా కాకుండా ఇరు వర్గాలు వాటి దోవన అవి వేదికలెక్కి రచ్చ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం పెద్దరికం అనిపించుకోదు.

మొహమాటం లేకుండా, రాగద్వేష రహితంగా ఇరు వర్గాలను గట్టిగా హెచ్చరించాలి. అది కూడా బహిరంగంగా. అప్పుడే మెగాస్టార్ కు ఓ పెద్దరికం వస్తుంది. గౌరవం వస్తుంది. అసలే తెరవెనుక రాజకీయాలు నడుపుతూ ప్రకాష్ రాజ్ ను రంగంలోకి ఆయనే దింపారు అనే వార్తలు వున్నాయి. అవి నిజమో కాదో తెలియదు. నిజం కాకపోతే, కాదని చెప్పడానికి ఇలాంటి అవకాశం కన్నా మించినది మరోటి రాదు.