మేడం.. దయచేసి పద్ధతిగా మాట్లాడండి

ప‌శ్చిమ‌బెంగాల్‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ నిప్పు ర‌గులుకుంది. అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ కార్య‌క‌ర్తలు, నేత‌లు మ‌ధ్య భౌతిక‌దాడులు, మాట‌ల…

ప‌శ్చిమ‌బెంగాల్‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ నిప్పు ర‌గులుకుంది. అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ కార్య‌క‌ర్తలు, నేత‌లు మ‌ధ్య భౌతిక‌దాడులు, మాట‌ల దాడులు రోజురోజుకూ తీవ్ర మ‌వుతున్నాయి. 

రాజ‌కీయ పార్టీల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు తోడు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్  జగదీప్‌ ధంఖర్ వ్య‌వ‌హార‌శైలి వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో  తాజాగా ‘మేడం.. దయచేసి కాస్త పద్ధతిగా మాట్లాడండి. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి’ అని ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీకి గ‌వ‌ర్న‌ర్ హిత‌వు చెప్పారు. 

దీన్ని బ‌ట్టి ఆ రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఎంత‌గా దిగ‌జారాయో అర్థం చేసుకోవ‌చ్చు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై నిన్న జ‌రిగిన దాడిని కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది.

తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ హెచ్చరించారు. ఆదే సంద‌ర్భంలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఘాటుగా స్పందించారు. బీజేపీ వాళ్లకు పనేమీ లేదని వ్యాఖ్యానించారు. 

ఓసారి హోం మంత్రి, మరోసారి చద్దా, నద్దా, ఫద్దా లాంటి వాళ్లు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడతారంటూ ముఖ్యమంత్రి  ఫైర్ అయ్యారు. ఔట్‌సైడర్స్‌ కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై  గవర్నర్‌ జగదీప్‌ ధంఖర్ స్పందించారు.  సీఎం మమత వ్యాఖ్యలను ఆయ‌న ఖండించ‌డం గ‌మనార్హం. బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం సరికాదని ఆయ‌న హిత‌వు చెప్పారు.  

‘మేడం.. దయచేసి కాస్త పద్ధతిగా మాట్లాడండి. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి’ అని గ‌వ‌ర్న‌ర్ విజ్ఞప్తి చేశారు. మ‌మ‌త ప్ర‌యోగించిన‌ ఔట్‌సైడర్స్ అనే ప‌దంపై కూడా గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. ఆ పదాన్ని ఆయ‌న‌ ప్రస్తావిస్తూ ‘సీఎం మేడం.. ఇండియా ఒక్కటే. 

భారతీయులంతా ఒకటే. నిప్పుతో చెలగాటం ఆడవద్దు. ఇన్‌సైడర్‌, ఔట్‌సైడర్‌ అంటూ విద్వేషాలు రెచ్చగొట్టవద్దు’ అని గవర్నర్ అన‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌వ‌ర్న‌ర్ హితవుపై సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఈ స్కీమ్ సఫలం అయితే ఎపి దేశానికి రోల్ మోడల్ అవుతుంది