పెళ్లికి ముందు ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. పెళ్లి తర్వాత కూడా అతడ్ని మరిచిపోలేకపోయింది. ఫలితంగా అతడి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
జార్ఘండ్ కు చెందిన 21 ఏళ్ల పూజ, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే పెద్దల బలవంతం పైన రాజేష్ వర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది పూజ. భార్యాభర్త ఇద్దరూ కలిసి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేశారు.
నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో పూజ, రాజేశ్ వర్మ కాపురం పెట్టారు. అయితే పెళ్లయినప్పటికీ పూజ, తన ప్రియుడ్ని మరిచిపోలేకపోయింది. భర్త ఆఫీస్ కు వెళ్లిన వెంటనే ప్రియుడితో ఫోన్ లో తరచుగా మాట్లాడేది. ఈ క్రమంలో హైదరాబాద్ రమ్మని పిలిచింది.
ప్రియురాలి పిలుపుతో సదరు వ్యక్తి జార్ఘండ్ నుంచి తన స్నేహితుడ్ని వెంటబెట్టుకొని హైదరాబాద్ వచ్చాడు. పూజ భర్త ఆఫీస్ కు వెళ్లిపోయాడని నిర్థారించుకున్న తర్వాత ఆమె ఇంటికెళ్లాడు. భర్తను వదిలేసి తనతో వచ్చేయాలని పూజను బలవంతం పెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పూజను హత్యచేసి అక్కడ్నుంచి పరారయ్యాడు.
ఇంటికొచ్చిన భర్త, చనిపోయి పడిఉన్న తన భార్యను చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.