హీరోయిన్లు స్లిమ్ గా కనిపించాలి. ఏ డ్రెస్ కైనా సూటయ్యే ఫిజిక్ మెయింటైన్ చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. బరువు పెరిగిన హీరోయిన్లు అవకాశాలు కోల్పోయిన సందర్భాలు గతంలో చాలానే చూశాం. ఇలా లావెక్కి ఛాన్సులు పోగొట్టుకున్న హీరోయిన్ల జాబితాలో ప్రియాంక జవాల్కర్ కూడా ఉంది.
టాక్సీవాలా సినిమా తర్వాత ఆమె బొద్దుగా మారింది. ఈ క్రమంలో కొన్ని అవకాశాలు కూడా పోగొట్టుకుంది. ఎట్టకేలకు తన వెయిట్ ఇష్యూస్ పై స్పందించింది ప్రియాంక జవాల్కర్. కేవలం ఆరోగ్య సమస్యల వల్ల మాత్రమే బరువు పెరిగిన విషయాన్ని బయటపెట్టింది.
“తిమ్మరుసు చూసిన తర్వాత చాలామంది బరువు తగ్గాలంటూ సలహాలిస్తున్నారు. నా ఫిజిక్ పై నాకు ఫోకస్ ఉండదా? ఎవరో చెబితేనే నేను తెలుసుకుంటానా? నాకు థైరాయిడ్ ఉంది. అందుకే బరువు పెరిగాను. ఆ తర్వాత డైట్ ఫాలో అయి, వ్యాయామాలు చేసి సన్నబడ్డాను.”
బరువు తగ్గడం చాలా కష్టమంటోంది ప్రియాంక. తనకు థైరాయిడ్ ఎటాక్ అయిందనే విషయాన్ని తెలుసుకోవడానికి టైమ్ పట్టిందని, అయితే అప్పటికే ఆలస్యమైందని, తను బరువు పెరిగానని చెప్పుకొచ్చింది.
ఇకపై స్లిమ్ గానే ఉంటానని చెప్పిన ప్రియాంక జవాల్కర్.. తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాల తర్వాత గమనం అనే మరో మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తానంటోంది.