ఎప్పుడు చూసినా హీరోయిన్లు నవ్వులు ఒలికిస్తూ, కవ్విస్తూ కనిపిస్తారు. కెమెరాలు కళ్ల ముందు కనిపిస్తే చాలు వాళ్ల ముఖంలో నవ్వు వచ్చేస్తుంది. అలా ఉండడం వాళ్లకు అవసరం కూడా. మరి నివేత పెతురాజ్ ఎందుకు ఎప్పుడూ సీరియస్ గా కనిపిస్తుంది. చాలా స్టిల్స్ లో ఆమె సీరియస్ గానే ఉంటుంది. నవ్వుతూ కనిపించేది చాలా తక్కువ.
ఇదే విషయంపై ఆమెను ప్రశ్నించింది మీడియా. దీనిపై కూడా అంతే సీరియస్ గా స్పందించింది నివేత పెతురాజ్. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా కనిపించడం చాలా అవసరం అంటోంది.
“నిజమే, నేను అప్పుడప్పుడు సీరియస్ గా కనిపిస్తాను. కానీ పైకి చూడ్డానికి మాత్రమే నేనలా సీరియస్ గా కనిపిస్తాను. నిజజీవితంలో నేను అలా ఉండను. బయటకొచ్చినప్పుడు మాత్రం కాస్త సీరియస్ లుక్ లో కనిపిస్తానంతే. దీంతో నా ఫొటోలు చూసి చాలామంది నాకు సీరియస్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు.”
ఇలా తన లుక్స్ పై స్పందించింది నివేత పెతురాజ్. తనకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని, నిజానికి అన్ని రకాల పాత్రల్ని తను చేయగలనని అంటోంది. ఇక ఫిల్మీ కెరీర్ పై స్పందిస్తూ.. కేవలం సినీ కెరీర్ పై హీరోయిన్లు ఆధారపడకూడదని చెబుతోంది.
“సినిమాలతో పాటు మరో ఫీల్డ్ పై కూడా హీరోయిన్లు అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే ఈ కరోనా టైమ్ లో సినీ అవకాశాలు రావడం లేదంటూ చాలామంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. అలా కుంగిపోకుండా ఉండాలంటే సినిమాలతో పాటు మరో ఆల్టర్ నేటివ్ కెరీర్ ఉండాలి. అందుకే నేను ఫార్ములా వన్ రేసింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను.”
ప్రస్తుతం తమిళ్ లో 3 సినిమాలు చేస్తున్న నివేత, డిసెంబర్ లో మరో తెలుగు సినిమా చేయబోతున్నట్టు తెలిపింది. పాత్ర బాగుంటే నటిస్తానని, తనకు లాంగ్వేజ్ తో సంబంధం లేదని అంటోంది ఈ 'సీరియస్' బ్యూటీ.