లవ్ చేస్తావా, లేదా నా చేయి కోసుకోమంటావా..? ఇది బాగా ఓల్డ్ స్టైల్. లవ్ చేస్తావా, లేదా నీ మొహంపై యాసిడ్ పోయమంటావా..? ఇది కూడా బాగా పాతబడిపోయింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. లవ్ చేస్తావా.. నీ ఇల్లు తగలబెట్టమంటావా? అంటూ కొంతమంది శాడిస్ట్ లు భయపెడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి.
ఆమధ్య నెల్లూరులో ఒక ప్రేమోన్మాది ప్రియురాలి ఇల్లు తగలబెట్టాడు. తనను ప్రేమించలేదన్న కసితో ప్రేయసిని.. ఆమె కుటుంబాన్ని కూడా రోడ్డుపైకి లాగాడు. తాజాగా.. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది. తన ప్రేమను నిరాకరించిందని యువతి ఇంటిని ఆ శాడిస్ట్ తగలబెట్టేశాడు.
వాడి పేరు నవీన్. నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. గంజాయికి కూడా అలవాటు పడ్డాడు. ఈ రెండు మత్తులు దిగితే.. వాడికి ప్రేమ మత్తు ముసిరేది. ఈ క్రమంలో ఓ యువతితో ఉన్న పరిచయాన్ని అడ్డు పెట్టుకుని ఆమెను ప్రేమ పేరుతో వేధించసాగాడు నవీన్. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకేముంది యువతితోపాటు.. వారి తల్లిదండ్రులపై కూడా కక్ష పెంచుకున్నాడు. కసి తీర్చుకున్నాడు.
పూటుగా మద్యం తాగిన నవీన్, యువతి ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకుని.. అక్కడికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఇల్లు మొత్తం కాలిపోయింది. వస్తువులు, నగలు, నగదు బూడిదయ్యాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన ఇప్పుడు మేడ్చల్ లో సంచలనంగా మారింది. శాడిస్ట్ నవీన్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.
ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వేధించడం, బెదిరించడం, వారిపై దాడి చేయడం.. ఇప్పటి వరకూ జరిగాయి. ఇప్పుడు అమ్మాయినే కాదు, వారి తల్లిదండ్రుల్ని కూడా బెదిరించేలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి శాడిస్ట్ లవర్స్ తో బీ కేర్ ఫుల్.