నీకు ఇంత రిస్క్ అవసరమా బంగార్రాజూ!

ఓవైపు సంక్రాంతి వార్ జోరుగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ రాకతో ఏ సినిమా బరిలో నిలుస్తుందో, ఏ సినిమా తప్పుకుంటుందో చెప్పలేని పరిస్థితి. సర్కారువారి పాట సినిమా ఆల్రెడీ అనధికారికంగా పోటీ నుంచి తప్పుకుంది. భీమ్లానాయక్…

ఓవైపు సంక్రాంతి వార్ జోరుగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ రాకతో ఏ సినిమా బరిలో నిలుస్తుందో, ఏ సినిమా తప్పుకుంటుందో చెప్పలేని పరిస్థితి. సర్కారువారి పాట సినిమా ఆల్రెడీ అనధికారికంగా పోటీ నుంచి తప్పుకుంది. భీమ్లానాయక్ కూడా దాదాపు అదే పొజిషన్ లో ఉంది. ఇలాంటి టైమ్ లో నేనున్నాను అంటూ ముందుకొస్తున్నాడు నాగార్జున. బంగార్రాజు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తానంటున్నాడు నాగ్.

ఈమధ్యే లాంఛ్ అయింది బంగార్రాజు ప్రాజెక్టు. అయినప్పటికీ నవంబర్ చివరి నాటికి షూటింగ్ పూర్తయిపోతుందని, డిసెంబర్ చివరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని చెబుతున్నాడు నాగార్జున. కచ్చితంగా సంక్రాంతికి వస్తామంటూ ఫీలర్లు వదుల్తున్నాడు.

ఓవైపు పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలే తప్పుకుంటుంటే, పోటీకి సై అంటున్న నాగార్జునన చూసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి 2 పాన్ ఇండియా సినిమాల మధ్య బంగార్రాజు ఎలా నెట్టుకొస్తాడా అని ఆశ్చర్యపోతున్నారు.

ఇవన్నీ ఒకెత్తయితే, నాగార్జున చెబుతున్నట్టు డిసెంబర్ కి ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందా అని అనుమానాలు వ్యక్తంచేసే వాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే, బంగార్రాజు సినిమా సోసియోఫాంటసీ మూవీ. దీనికి భారీ సెట్స్ కావాలి. గ్రాఫిక్ వర్క్ జరగాలి. అవన్నీ ఈ 2 నెలల్లో పూర్తవుతాయా అనేది అందరి సందేహం.

ఓవైపు ఇన్ని అనుమానాలు, ఆశ్చర్యాలు ఉన్నప్పటికీ నాగార్జున మాత్రం సంక్రాంతి రిలీజ్ పై పట్టుదలతో ఉన్నాడట. సోగ్గాడే చిన్ని నాయనా సంక్రాంతికొచ్చింది కాబట్టి, బంగార్రాజు కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలనేది అతడి ఆలోచన.