సోలోగా ఎన్నికల్లో నెగ్గడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి అస్సలు సాధ్యమయ్యే పని కాదు. కొన్ని పార్టీలతో పగటి పొత్తులు, మరి కొన్నింటితో చీకటి పొత్తులు పెట్టుకుంటే కానీ.. టీడీపీ ఉనికిలో నిలవడం సాధ్యం కాదు.
అలాంటి పగటి, చీకటి పొత్తులు పెట్టుకున్నా.. గత ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది. ఇక ప్రతిపక్షంగా టీడీపీ పరిస్థితి మరీ నిస్తేజం అయిపోయింది. అనుకూల మీడియా రాతల్లో తప్ప ఏపీలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది.
సరిగ్గా ఇలాంటి సమయంలో ఏదో వంక పట్టుకుని ఢిల్లీకి వెళ్లారు చంద్రబాబు నాయుడు. అక్కడ ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ తో సహా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం టీడీపీ వర్గాలు తమ పరపతిని అంతా ఉపయోగించే ఉంటాయి.
అయితే చంద్రబాబుకు ఆ సమావేశాలకు అవకాశం లభించలేదు. ఇంకా అక్కడే ఉంటే.. పరువు పోవడమే తప్ప ప్రయోజనం లేదనే లెక్కలతో రిటర్న్ అయిపోయారు.
ఒకవేళ చంద్రబాబుకు మోడీ తో కానీ, షాతో కానీ అపాయింట్ మెంట్ లభించి ఉంటే, అనుకూల మీడియా రచ్చ రచ్చ చేసేది. జగన్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడానికి మోడీ, షా తలాడించారనేంత స్థాయిలో ఉండేది ప్రచారం.
జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ఢిల్లీలో పని మొదలైందనేంత స్థాయిలో రచ్చ చేసే వాళ్లు. అయితే వారితో చంద్రబాబుకు అపాయింట్మెంట్ దొరకకపోవడంతో తేలు కుట్టిన దొంగల్లే పచ్చ మీడియా కిక్కురుమనడం లేదు!
బహుశా గతంలో చంద్రబాబు నాయుడు తమతో ఆడిన ఆటను మోడీ, షాలు మరిచిపోయినట్టుగా లేరనే అనుకోవాల్సి వస్తోంది. అందితే జట్టు, అందకపోతే కాళ్లు అన్నట్టుగా వ్యవహరించే చంద్రబాబుతో దూరంగా ఉండటానికే బీజేపీ అధినాయకత్వం ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా ఉంది.
ఇప్పటికే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జిలు ఎవరొచ్చినా చంద్రబాబుతో ఇక స్నేహం ఉండదని ఒకటికి పది సార్లు చెబుతున్నారు. ఏపీ బీజేపీలో కూడా చంద్రబాబు ఏజెంట్లకు పని తగ్గిపోయింది. మరి తిరిగి బీజేపీ పంచన చేరాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు భంగపాటే మిగిలినట్టుగా ఉంది.