ఆంధ్రప్రదేశ్ పెద్దల సభకు నమస్కారం పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. 58 మంది సభ్యులున్న మండలి జగన్ సర్కార్‌కు ఆర్థిక భారంతో పాటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎక్కువగా ఉండడం తలనొప్పిగా మారింది. బిల్లుల ఆమోదంలో అడ్డంకులు ఎదురవుతుండడంతో జగన్ సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం.
1958లో ఏపీ శాసనమండలి ఏర్పాటైంది. 1985లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బాధ్యతలు చేపట్టాక మండలిని రద్దు చేయాలని కేంద్రానికి తీర్మానం పంపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని గౌరవించి రద్దుకు అంగీకరించారు. 1985లో అఖండ విజయంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు. అయితే మండలిలో కాంగ్రెస్ సభ్యులు ఎక్కవగా ఉండడంతో ఎన్టీఆర్‌కు దిక్కుతోచలేదు. దీంతో రద్దుకు వెనుకాడలేదు.
ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. 2007లో తిరిగి ఆయన నేతృత్వంలో మండలిని పునరుద్ధరించారు. ప్రస్తుతం మండలిలో మొత్తం సభ్యులు 58 మంది. వీరిలో అధికార వైసీపీకి 9, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి 30 పైచిలుకు సభ్యులున్నారు. ఆరు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించి అధికారాన్ని దక్కించుకొంది.
అయితే మండలిలో అధికార పార్టీ సభ్యులు తక్కువగా ఉండడం ఒకింత అసౌకర్యానికి ప్రభుత్వం గురవుతోంది. జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లుతో పాటు ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లులు అమోదం పొందాయి. అయితే మండలికి వచ్చేసరికి సవరణ కోరుతూ సభ్యులు వెనక్కి పంపారు. దీంతో తిరిగి అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకు ఈ బిల్లులపై ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేసే వీలు లేదు.
2021లో పెద్దసంఖ్యలో టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. అప్పుడు వైసీపీ సభ్యులకు ఎక్కువ సంఖ్యలో అవకాశం లభిస్తుంది. అయితే అసెంబ్లీలో భారీ మెజార్టీతో ఆమోదం పొందిన బిల్లులను రాజకీయ కారణాలతో వెనక్కి పంపడంపై జగన్ సర్కార్ సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. నిజంగా మండలి సభ్యులు చేసే సవరణల్లో సహేతుకమైన కారణం ఉంటే…ఆ పని చేయవచ్చని, కేవలం రాజకీయ దురుద్దేశంతో తిరిగి పంపితే ఎలా భరించాలనే వాదన వినిపిస్తోంది.
రెండోసారి కూడా మండలి సభ్యులకు తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ, శాసనసభ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కానీ అనవసరమైన రాజకీయాలకు ప్రతిపక్ష పార్టీలకు ఓ వేదిక ఉండడం మంచిది కాదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండళ్లున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, కర్నాటక, మహారాష్ట్ర లలో మాత్రమే శాసనమండళ్ల వ్యవస్థ ఉంది. అందులోనూ మండళ్లను ఏ రాష్ట్రమైనా రద్దు చేయాలనుకుంటోందా అని కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం రాష్ట్రాలకు లేఖ రాసినట్టు సమాచారం. అయితే రాజకీయ కారణాల రీత్యా తాము కొనసాగిస్తామని రెండు తెలుగు రాష్ట్రాలు బదులిచ్చినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఒకవేళ తాము మండలిని రద్దు చేయాలని కేంద్రానికి ఓ తీర్మానాన్ని పంపితే …వెంటనే మోడీ సర్కార్ అంగీకరిస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మండలి రద్దుపై ఆవేశంలో ఆలోచన చేస్తున్నారా లేక ఆర్థికంగా భారమని ప్రభుత్వం యోచిస్తోందా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మీద మండలి రద్దుపై మాత్రం రాజకీయ వర్గాల్లో సీరియస్ చర్చ సాగుతోంది. కాలమే అన్నిటికి జవాబు చెప్పాల్సి ఉంది.