నెల ఆగండి. మూడు రాజధానులకు టీడీపీ వ్యతిరేకం కాదు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకుంటాడు. ఎందుకంటే మొదట వ్యతిరేకించడం, ఆ తర్వాత తానే ఆద్యుడినని ప్రకటించడం ఆయనకు అలవాటైన విద్యే కదా. ఈ రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిన ఘనత తమదేనని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గొప్పలు చెప్పిన విషయం తెలిసిందే. బాబు ఆలోచన, ఆచరణ తెలిసిన ఓ తెలుగు వాడిగా… నెల తర్వాత మూడు రాజధానులపై అసెంబ్లీలో ఆయనేం మాట్లాడుతారో ఊహించి రాసిన సరదా కథనం ఇది.
అధ్యక్షా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఓ చట్టం తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం చరిత్రాత్మకమైంది. నిజానికి ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని విభజిత ఏపీ మొదటి ముఖ్యమంత్రినా నేను కల కన్నాను. నా కలను నెరవేరుస్తున్ననా సహచరుడు, ఆత్మీయ మిత్రుడైన వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్‌ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
అయితే జగన్ వ్యవహార శైలి దగ్గరగా చూసిన కారణంగా నాకో అనుమానం ఉంది. సాక్షి పత్రిక మన సీఎం గారి మానస పుత్రిక. నాలుగైదేండ్ల క్రితం సాక్షి పత్రికకు సంబంధించి ఎడిషన్లన్నింటిని ఎత్తేసి మంగళగిరి, తిరుపతి, విశాఖపట్నం తదితర రీజనల్ కేంద్రాల్లో కలిపేసిన విషయం తెలిసింది. అయితే ఎంతోకాలం ఆ పద్ధతి కొనసాగించలేదు. తిరిగి అక్కడి నుంచి యధాస్థానాలకు ఎడిషన్లను మార్చారు.
జగన్ అలాంటి అనుభవాన్నిచూస్తే తిరిగి ఈ మూడు రాజధానులను అమరావతికో లేక కేసీఆర్‌తో మాట్లాడి హైదరాబాద్‌కు తరలిస్తారేమోననే భయం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మూడు రాజధానులని జగన్ ప్రకటించగానే ఇదో పిచ్చి తుగ్లక్ పాలన అని నేను విమర్శించాను. అంతే తప్ప నేను మూడురాజధానులకు వ్యతిరేకం కాదు…కాదు అని బల్లగుద్ది మరీ చెబుతున్నాను.
కాలం కలిసి రాక, నేను అధికారంలోకి రాలేకపోయాను. నేను శ్రీకారం చుట్టిన రాజధాని అమరావతి నుదుట మూడురాజధానులు కావాలని రాసి ఉంది. అందుకే అది నేటికి నెరవేరింది. నా ప్లేస్‌లో జగన్ మూడు రాజధానులు ప్రకటించారు. అదే విధి రాత అంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నేను మూడు రాజధానులకు వ్యతిరేకమని ఆ అబద్ధాల సాక్షి, ఈ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే రాస్తూ, చెబుతూ వస్తున్నారు. అది నిజం కాదు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నేను అనుకుంటే, అప్పట్లో ఈ సాక్షి ఏం రాసిందో చూడండి అధ్యక్షా.
అసలే చిన్న రాష్ట్రమని, అలాంటిది మూడు రాజధాని కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఏదీ సరిగా అభివృద్ధి జరగదని నాడు ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో మాట్లాడలేదా అధ్యక్షా? ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను పరిశీలిస్తే సభతో పాటు సమాజానికి వాస్తవాలు తెలుస్తాయి. ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే, మూడురాజధానులు నా మానస పుత్రికలు. మూడు రాజధానులను కూడా ప్రజా రాజధానులుగా తీర్చిదిద్దుతానని ఈ అసెంబ్లీ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తన్నాను. అమరావతికి జై, మూడు రాజధానులకు జైజై.