చిత్తూరు జిల్లాకి చెందిన రైతు నాగేశ్వరరావుకి సోనూ సూద్ సాయం చేసిన వెంటనే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూశారు చంద్రబాబు. సోనూ సూద్ ని ఆకాశానికెత్తేశారు, పనిలో పనిగా కూతుళ్లకు తాను చదువు చెప్పిస్తానంటూ ముందుకొచ్చారు. చంద్రబాబు ఎంత అవకాశవాదో, పక్కనోళ్ల క్రెడిట్ తాను కొట్టేయడంలో ఎంత నేర్పరో అందరికీ తెలిసిన విషయమే.
అయితే సోషల్ మీడియాలో చంద్రబాబులాంటోళ్లు చాలామందే ఉన్నారని సోనూసూద్ ఉదంతంతో మరోసారి రుజువైంది. వాస్తవానికి కృష్ణమూర్తి అనే జర్నలిస్ట్ ఈ వీడియోని సోషల్ మీడియాలో 25వ తేదీన పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ ఒక్కరోజులోనే వైరల్ గా మారింది. అయితే ఇక్కడే ఆ వీడియో క్రెడిబిలిటీ వ్యవహారం రచ్చకెక్కింది.
సోనూ సూద్ రిప్లై ఇచ్చిన తర్వాత అదే వీడియోని చాలామంది తమ అకౌంట్లలో పోస్ట్ చేసుకున్నారు. తమ వల్లే ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని బిల్డప్ ఇచ్చుకున్నారు. ఈనాడు కూడా తమ పేపర్లో వచ్చిన వార్తకు సోనూ సూద్ స్పందించినట్టుగా రాసుకుంది. టీవీ9లో అయితే తమ కవరేజీ చూసి సోనూసూద్ చలించిపోయి స్పందించాడని చెప్పుకుంది.
ఇలా ఎవరికి వారు తమ వల్లే రైతుకి న్యాయం జరిగింది, తమ వార్తను చూసే సోనూ సూద్ స్పందించారంటూ ఎవరికి వాల్లే ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని చూశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్రెడిబిలిటీ వార్ గట్టిగా నడుస్తోంది. ఓ వైపు చంద్రబాబు, మరోవైపు ఇతర మీడియా జనాలు ఎవరికి వారే ఈ వ్యవహారాన్ని హైలెట్ చేసుకుంటున్నారు. కొన్ని వెబ్ ఛానెళ్లు కూడా ఈ పోటీలో చేరిపోయాయి.
ఇవన్నీ పక్కనపెడితే.. చంద్రబాబుకి మాత్రం ఇది పూర్తిగా రివర్స్ లో కొట్టింది. దేశంలో ఎక్కడైనా, ఏదైనా జరిగిందంటే అది తన చలవే అని చెప్పుకుంటారు బాబు. ఆ వెంటనే అతడి మీడియా కూడా బాకాలతో రెడీ అయిపోతుంది. హైటెక్ సిటీ కట్టించా, సెల్ ఫోన్ కనిబెట్టా, కలాంను రాష్ట్రపతిని చేశా, మోడీని నేనే సిఫార్స్ చేశా.. లాంటి ఎన్నో కథలు గతంలో బాబు నోటి నుంచి అలవోకగా వచ్చాయి.
ఇలా పక్కోడి క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడం బాబుకు బట్టర్ తో పెట్టిన విద్య. సోనూ సూద్ వ్యవహారంలో కూడా బాబు కాస్త ఆ దిశగానే అడుగులు వేశారు. అందర్నీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కరోనా కష్టకాలంలో సోనూ సూద్ కొన్ని వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయమందించారు. అయితే ఏపీలో జరిగినట్టు ఇంకెక్కడా జరిగిఉండదు. ఆ గొప్ప మాదంటే మాదేనంటూ చంద్రబాబులాంటివాళ్లు పోటీపడటమే ఇక్కడ విచిత్రం.