ఎన్నిక‌ల సంఘంలో మాయ‌ల ప‌కీర్

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గ‌త నెల‌లో కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శికి రాసిన ఐదు పేజీల‌ లేఖపై సీఐడీ ద‌ర్యాప్తులో వెల్ల‌డ‌వుతున్న నిజాలు మాయ‌ల ప‌కీర్ క‌థ‌ను గుర్తు చేస్తున్నాయి. మాయ‌ల…

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గ‌త నెల‌లో కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శికి రాసిన ఐదు పేజీల‌ లేఖపై సీఐడీ ద‌ర్యాప్తులో వెల్ల‌డ‌వుతున్న నిజాలు మాయ‌ల ప‌కీర్ క‌థ‌ను గుర్తు చేస్తున్నాయి. మాయ‌ల ప‌కీర్‌ను త‌ల‌ద‌న్నేలా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ వ్య‌వ‌హ‌రించార‌నే నిజాలు స‌భ్య స‌మాజం నివ్వెర‌పోయేలా ఉన్నాయి. ముందుగా మాయ‌ల ప‌కీర్ గురించి   చెప్పుకుందాం. మాయ‌ల ప‌కీర్ ఓ మాంత్రికుడు. చేతిలో దండం, న‌ల్ల‌టి వ‌స్త్ర‌ధార‌ణ‌, శ‌రీరానికి పుర్రెల‌తో అలంక‌ర‌ణ‌, చేతులు తిప్పుతూ అత‌ను చేసే మాయ‌లు అన్నీఇన్నీ కావు.

ఆ మాయ‌లోడు బాల‌నాగ‌మ్మ అనే మ‌హారాణిని అప‌హ‌రిస్తాడు. త‌ల్లిని కాపాడుకునేందుకు బాల‌వ‌ర్తి అనే యువ‌కుడు బ‌య‌ల్దేరుతాడు. అయితే మాయ‌ల ప‌కీర్ అత్యంత శ‌క్తిమంతుడు. అనేక శ‌క్తుల‌ను వ‌శ‌ప‌ర‌చుకున్న అత‌న్ని అంత‌మొందించి త‌ల్లిని కాపాడుకోవ‌డం అత‌ని వ‌ల్ల కాలేదు. మాయ‌ల ప‌కీర్ గొంతు న‌రికినా చావ‌డు. ఎందుకంటే అత‌ని ప్రాణం మ‌రెక్క‌డో ఉంటుంది.

దీంతో అత‌ను త‌ప‌స్సు చేసి అమ్మ‌వారి కృప‌కు పాత్రుడ‌వుతాడు. మాయ‌ల ప‌కీర్‌ను చంపి, త‌ల్లిని ర‌క్షించుకునే ఉపాయం చెప్పాల‌ని దేవ‌త‌ను ప్రాథేయ‌ప‌డుతాడు. మాయ‌ల ప‌కీర్ ప్రాణం ఏడు స‌ముద్రాల అవ‌త‌ల మ‌ర్రిచెట్లు తొర‌లో ఉన్న చిలుక‌లో ఉంద‌ని అమ్మ‌వారు చెబుతుంది. అప్పుడా అమ్మ‌వారి చ‌లువ‌తో ఆ యువ‌కుడు స‌ప్త స‌ముద్రాలు దాటి మ‌ర్రిచెట్టు ద‌గ్గ‌రికి వెళ్తాడు. ఆ చెట్టు తొర‌లో ఉన్న చిలుక‌ను చేతికి తీసుకుంటాడు.

మొద‌ట చిలుక రెక్క‌లు విరిస్తే మాయ‌ల ప‌కీర్ చేతులు విరిగి పోతాయి. ఆ త‌ర్వాత చిలుక కాళ్లు విర‌గ్గొడుతాడు. దీంతో మాయ‌ల ప‌కీర్ కాళ్లు విరిగిపోతాయి. చివ‌రికి చిలుక గొంతు నులిమి ప్రాణం తీస్తాడు. అప్పుడు మాయ‌ల ప‌కీర్ పీడ విర‌గ‌డ‌వుతుంది. త‌ల్లిని కాపాడుకుని తిరుగుముఖం ప‌డ‌తాడు.

ఇపుడు ఏపీలో మాయ‌ల ప‌కీర్‌ను త‌ల‌ద‌న్నే మాంత్రికుడి గురించి చెప్పుకోవాలి. అత‌ను ఎన్నిక‌ల సంఘంలో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కీల‌క ప‌ద‌విలో ఉన్నాడు. రాజ్యాంగం క‌ల్పించిన అధికారాలు చేతిలో ఉన్నాయి క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఆడించేందుకు య‌త్నించాడు. కానీ అతన్ని ఆడించే శ‌క్తి ప‌చ్చ‌ని చెట్టు తొర‌లో ఉంటుంది. ఆ చిలుక ఆదేశాల మేర‌కు ఈ ప‌కీర్ న‌డుచుకునే వాడు. అయితే త‌న పన్నాగం కుద‌ర్లేద‌ని కేంద్ర‌హోంశాఖ‌కు ఐదు పేజీల లేఖ రాశాడు. ఈ లేఖ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర నిందారోప‌ణ‌లున్నాయి.

ఆ లేఖ రాసిన మాయ‌లోడిపై అధికార పార్టీలోని  ముఖ్య‌నేత విజ‌య‌సాయిరెడ్డికి అనుమానం వ‌చ్చింది. దీంతో ఆ లేఖ‌పై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ  డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఈనెల 14న విజ‌య‌సాయిరెడ్డి  ఫిర్యాదు చేశాడు. ఈ నేప‌థ్యంలో సీఐడీ దర్యాప్తున‌కు డీజీపీ ఆదేశించాడు. సీఐడీ ద‌ర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ప్ర‌ధానంగా కేంద్ర‌హోంశాఖ‌కు స‌ద‌రు మాయ‌ల ప‌కీర్‌ను త‌ల‌ద‌న్నే ఆ కీల‌క అధికారి రాసిన లేఖ రిఫ‌రెన్స్ నెంబ‌ర్ 221తోనే టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు రాసిన లేఖ కూడా ఉంద‌ని నిర్ధార‌ణ అయింది. అలాగే  లేఖకు సంబంధించిన అన్ని ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఎన్నిక‌ల మాయ‌ల ప‌కీర్  సహాయ కార్యదర్శి  సీఐడీ అధికారుల వద్ద అంగీకరించ‌డం విశేషం.  ల్యాప్‌టాప్‌లో ఫైల్స్‌ డిలీట్‌ చేయడం, పెన్‌ డ్రైవ్‌ ధ్వంసం కావడంతోపాటు డెస్క్‌ టాప్‌ను రెండు మూడు పర్యాయాలు ఫార్మాట్‌ చేసినట్లు సీఐడీ ద‌ర్యాప్తులో నిర్ధారణ అయింది.  

సాక్ష్యాలను (ఎవిడెన్స్‌) ట్యాంపర్‌ చేయడాన్ని గమనిస్తే ఈ లేఖ త‌యారీపై స‌హ‌జంగానే అనేక అనుమానాలు క‌లుగు తున్నాయి. అంద‌రూ అనుమానిస్తున్న‌ట్టే ఈ ఎన్నిక‌ల మాయ‌ల ప‌కీర్ ప్రాణం టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేతిలో ఉంద‌ని అర్థం చేసుకోవ‌డం పెద్ద విష‌యం కాదు. ఎందుకంటే నిజం అదే కాబ‌ట్టి. బాబు చేతిలో రిమోట్ పెట్టుకుని అత‌ను ఆడించిన‌ట్టు ఆడే ఆట‌లో భాగ‌మే కేంద్ర హోంశాఖ‌కు ఐదు పేజీల లేఖ రాసిన‌ట్టుగా అర్థం చేసుకోవాలి.

అయితే అధికార పార్టీ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ ముందు ఎన్నిక‌ల సంఘంలోని మాయ‌ల ప‌కీర్ ప‌ప్పులుడ‌క‌లేదు. ఐదు పేజీల లేఖ‌పై మీడియాలో ర‌చ్చ‌ర‌చ్చ అవుతున్నా కిమ్మ‌న‌కుండా ఎంజాయ్ చేసిన మాయ‌లోడు….డీజీపీకి విజ‌యసాయి ఫిర్యాదు చేయ‌గానే…తానే లేఖ రాశాన‌ని ఒప్పుకోవాల్సిన త‌ప్ప‌ని ప‌రిస్థితి. సీఐడీ ద‌ర్యాప్తు మ‌రింత లోతుగా జ‌రిగితే ఇంకెన్ని నిజాలు బ‌య‌టికొస్తాయో, ఈ ఎన్నిక‌ల మాయ‌లోడి ప‌రిస్థితి ఏంటో?

చిన్న‌ప్పుడు మాయ‌ల ప‌కీర్ గురించి విన్న‌ప్పుడు…క‌థ అని స‌రిపెట్టుకున్నాం. కానీ ఎన్నిక‌ల సంఘంలో ఉంటూ, టీడీపీ కార్యాల‌యం నుంచి వ‌చ్చే ఆదేశాల మేరకు న‌డుచుకునే మాయ‌ల ప‌కీర్‌ను ప్ర‌త్య‌క్షంగా చూస్తామ‌ని మ‌న‌మెరం అనుకుని ఉండం. ఒక‌ప్పుడు ఒక మాయ‌ల ప‌కీర్‌నే చూశాం. కానీ ఇప్పుడు ఎంతెంత మంది మాయ‌ల ప‌కీర్లో క‌దా!

-సొదుం

లోకమణి అమ్మకి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు