పరీక్ష పెట్టొద్దంట.. ఉద్యోగం మాత్రం కావాలంట

రాష్ట్రంలో కొన్నిరోజులుగా జరుగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనలపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. గ్రామ సచివాలయ పోస్టుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయారిటీ ఇస్తామని, వారి సర్వీసుని పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే నోటిఫికేషన్లో స్పష్టంచేశారు.…

రాష్ట్రంలో కొన్నిరోజులుగా జరుగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనలపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. గ్రామ సచివాలయ పోస్టుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయారిటీ ఇస్తామని, వారి సర్వీసుని పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే నోటిఫికేషన్లో స్పష్టంచేశారు. అయితే అలా కుదరదట, తమకి పరీక్ష లేకుండానే ఉద్యోగాలివ్వాలంటూ మొండికేసి కూర్చున్నారు కొంతమంది. గ్రామ సచివాలయాల్లో కొత్తగా ఏఎన్ఎం పోస్ట్ లకు అప్లికేషన్లు ఆహ్వానించారు. దీంతో ఇప్పటికే ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నవారంతా నిరసనకు దిగారు.

రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్ఓ ఆఫీసుల్ని ముట్టడించారు. సహజంగానే ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా దీన్ని బాగా హైలెట్ చేసింది. అయితే వారి డిమాండ్ వింటే మాత్రం సామాన్యులు విస్తుపోవాల్సిందే. తమకు అనుభవం ఉంది కాబట్టి పరీక్షల్లో తమకు గ్రేస్ మార్క్స్ ఇవ్వండి అనడం వరకు ఓకే, అసలు మాకు పరీక్షే పెట్టొద్దు ఉద్యోగం ఇవ్వండి అంటే మిగతా నిరుద్యోగుల సంగతి ఏంటి? ఇదే తరహాలో రెండు రోజులుగా ఎంపీఈవోలు కూడా ఆందోళనలకు దిగారు.

వీరంతా గ్రామ సచివాలయాల్లో భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలు తమకి నేరుగా ఇచ్చేయాలని కోరుతున్నారు. అంటే రాను రాను ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు వేయడానికి కూడా వెనకాడే పరిస్థితిని తెస్తున్నారు. వీరివెనక ప్రతిపక్షం ఉంది అనేమాట వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో ప్రతిభ లేకుండా కేవలం రికమండేషన్లపై ఉద్యోగాలు తెచ్చుకున్నవారే ఇలా ఇప్పుడు నిరసనకు దిగుతున్నారు. తమతోపాటు అందర్నీ కలుపుకొని అలజడి సృష్టిస్తున్నారు. అయితే ఈసారి జగన్ సర్కార్ ఇలాంటి ఆందోళనలకు తలొగ్గేలా కనిపించడం లేదు.

ఇప్పటికే చాలామంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచారు, గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో వెసులుబాటు కల్పించారు. ఇంకా తమను పట్టించుకోలేదని రోడ్డెక్కితే అవి వారి గొంతెమ్మ కోర్కెలే అవుతాయి. ఒకవేళ సీఎం జగన్ నిజంగా వీరిపట్ల సానుకూలంగా వ్యవహరిస్తే అది యువ నిరుద్యోగులకు శాపంగా మారుతుంది. ఆమేర పోస్టుల సంఖ్యలో కోత పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఓ పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని పక్కనపెడితే అవి కేవలం పార్టీ కార్యకర్తలకే దక్కే అవకాశం ఉంటుంది. ఇలాంటి చెడు సంప్రదాయం ఎప్పటికీ రాష్ట్రంలో రాకూడదనే కోరుకుందాం.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది