వార్తలకోసం, బ్రేకింగ్ లకోసం న్యూస్ ఛానెళ్లు ఎంతకైనా దిగజారుతాయనే విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా హవా పెరిగిన వేళ.. ఎలక్ట్రానికి మీడియా మరింత దిగజారడానికి సైతం సిద్ధపడుతోంది. అమరావతిపై జరిగిన, జరుగుతున్న రాద్ధాంతమే దీనికి తాజా నిదర్శనం.
మంత్రి బొత్స సత్యనారాయణ కాకతాళీయంగా అన్న మాటల్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో తెలియక చివరకు అమరావతికి నిప్పుపెట్టింది మీడియా. రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు అంటూ ఎపిసోడ్ మెదలు పెట్టింది. బొత్స అసలు ఏం మాట్లాడారో జనాలకు తెలిసేలోపే.. రాజధాని మారిపోతోంది అనే విషయం దావానలంలా వ్యాపించింది. కనీసం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకి కూడా బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారనే విషయంపై పూర్తి క్లారిటీలేదు. ఈలోగానే మీ స్పందన ఏంటి అని మైకులు ముందుకొచ్చేశాయి. దీంతో ఎవరికి తోచింది వారు మాట్లాడేశారు.
దీన్నిలా రచ్చచేయడం కుదరదని తేలడంతో.. ప్రతిపక్ష నేతల్ని చర్చల్లోకి లాక్కొచ్చింది. అసెంబ్లీ మెట్లెక్కే అర్హత కూడా లేని కాంగ్రెస్, బీజేపీలు రాజధాని గురించి ఏం మాట్లాడతాయి. చాలా రోజుల తర్వాత మీడియాలో కనిపించే అవకాశం రావడంతో.. ఆ రెండు పార్టీల నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడేశారు. దొనకొండ, తిరుపతి కొండ.. ఇలా రకరకాల పేర్లు చెప్పి కన్ఫ్యూజన్ స్టార్ట్ చేశారు. ఇంతరో ఓ టీవీ ఛానెల్ దొనకొండ రియల్ ఎస్టేట్ పై దృష్టిసారించింది.
మరో టీవీ ఛానెల్ అమరావతిలో పడిపోతున్న మార్కెట్ పై ఫోకస్ పెట్టింది, ఇంకో ఛానెల్ తిరుపతి జనాల అభిప్రాయాలు తీసుకుంది. ఇలా బొత్స రాజేశాడంటున్న ఈ అగ్గికి న్యూస్ ఛానెళ్లు ఆజ్యం పోశాయి. అసలు రాజధాని గురించి ఇంత సీరియస్ గా నేను మాట్లాడానా అంటూ బొత్సే ఆశ్చర్యపోయేలా చేశాయి టీవీ ఛానెళ్లు. పైనల్ గా చంద్రబాబు టీమ్ కూడా రంగంలోకి దిగి అమరావతిని అడ్డుకునేందుకే జగన్ కుట్ర చేస్తున్నారంటూ తనదైన శైలిలో మాట్లాడారు.
బాబు చేసిన అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ పని అన్నట్టు కట్టుకథలు అల్లారు. చివరకు వైసీపీ మంత్రులంతా క్లారిఫికేషన్ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. రాజధాని తరలించట్లేదు, టీడీపీ తప్పుడు ప్రచారం నమ్మొద్దు అంటూ మంత్రులంతా జిల్లా పర్యటనల్లో స్పష్టంచేశారు. అయితే అప్పటికే నిప్పు రాజుకుంది, దీన్ని చల్లార్చాలంటే అది కూడా మీడియా చేతిలో పనే. అయితే అగ్గి రాజుకుంటేనే టీఆర్పీ రేటింగ్.. చల్లారితే ఛానెళ్లు ఎవరు చూస్తారు. అందుకే మరికొన్నిరోజులైనా ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది. అప్పటివరకూ ఇందులోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలు అనుకోవాల్సిందే.