మీడియా కుమ్ముడు…తిలా పాపం త‌లా పిడికెడు!

జ‌నం సొమ్మును మీడియా సంస్థ‌ల‌కు అప్ప‌నంగా దోచేస్తూ… సొంత భ‌జ‌న చేసుకోవ‌డం ప్ర‌భుత్వాల‌కు అల‌వాటుగా మారింది. ప్ర‌చార యావ‌లో చంద్ర‌బాబుతో పోల్చుకుంటే వైఎస్ జ‌గ‌న్‌లో కాస్త త‌క్కువే. అంతే త‌ప్ప‌, ఏదో ఒక పేరుతో…

జ‌నం సొమ్మును మీడియా సంస్థ‌ల‌కు అప్ప‌నంగా దోచేస్తూ… సొంత భ‌జ‌న చేసుకోవ‌డం ప్ర‌భుత్వాల‌కు అల‌వాటుగా మారింది. ప్ర‌చార యావ‌లో చంద్ర‌బాబుతో పోల్చుకుంటే వైఎస్ జ‌గ‌న్‌లో కాస్త త‌క్కువే. అంతే త‌ప్ప‌, ఏదో ఒక పేరుతో కావాల్సిన మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌క‌ట‌న‌లో రూపంలో జ‌నం సొమ్మును ధార‌పోయ‌డంలో అన్ని ప్ర‌భుత్వాలు ఒకే విధానాన్ని అవ‌లంబిస్తున్నాయ‌నేది స‌త్యం.

‘సొంత మీడియాకు సొమ్ములు కుమ్ముడు!’ శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతి తాజాగా ప్ర‌చురించిన క‌థ‌నంతో తేనెతుట్టెను క‌దలించిన‌ట్టైంది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నంత కాలం ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల‌తో పాటు ఏబీఎన్‌, ఈటీవీ త‌దిత‌ర ఎల్లో చాన‌ళ్ల‌కు ప్ర‌క‌ట‌నల‌ రూపంలో కుమ్ముడే కుమ్ముడు. 

దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నే స్పృహ క‌లిగిన స‌ద‌రు మీడియా సంస్థ‌ల య‌జ‌మానులు ప్ర‌భుత్వం నుంచి యాడ్స్ రాబ‌ట్టుకోవ‌డంలో ఆకాశ‌మే హ‌ద్దుగా వ్య‌వ‌హ‌రించాయ‌నే విమ‌ర్శ‌లున్నాయి. నాడు చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థి పార్టీ అధినేత‌కు సంబంధించిన మీడియా సంస్థ‌కు అడ్వ‌ర్‌టైజ్‌మెంట్స్ ఇవ్వ‌లేదు. అప్ప‌ట్లో త‌న‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌కుండా ప‌క్ష‌పాత వైఖ‌రితో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సాక్షి మీడియా గ‌గ్గోలు పెట్టింది.

నేడు సాక్షి స్థానాన్ని ఆంధ్ర‌జ్యోతి పోషిస్తోంది. తేడా అధికార మార్పిడే త‌ప్ప‌… విధానాలు కాద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అస‌లు ఉనికిలోలేని ప‌త్రిక‌ల‌కు కోట్లాది రూపాయ‌లు ధారాద‌త్తం చేశారంటే… ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డంలో దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. పాత్రికేయుల‌కు అక్రిడిటేష‌న్లు ఇచ్చేందుకు స‌వాల‌క్ష నిబంధ‌న‌లు పెట్టిన ప్ర‌భుత్వం… మ‌రి మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డానికి మాత్రం ఓ విధానం అంటూ లేదా? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

అస‌లు ఎప్పుడూ పేరే విన‌ని ప‌త్రిక‌ల‌కు, యాడ్ ఏజెన్సీల‌కు ప్ర‌భుత్వం అడ్వ‌ర్‌టైజ్‌మెంట్స్ ఇవ్వ‌డంలో భారీ అవినీతి ఉంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ముఖ్యంగా భూసేక‌ర‌ణ యాడ్స్ ఇవ్వ‌డంలో ఇటు పౌర‌సంబంధాల‌శాఖ‌తో పాటు సంబంధిత విభాగాల అధికారులు, మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు కుమ్మ‌క్కై జ‌నం సొమ్మును అందిన కాడికి కుమ్మేస్తున్నారు. అవినీతిని వెలికి తీయాల్సిన మీడియా సంస్థ‌లే అందులో భాగ‌స్వామ్యం అవుతున్న‌ప్పుడు…ఇక జ‌నానికి నిజాలు తెలిసే అవ‌కాశమే లేదు.

రాష్ట్రంలో స‌ర్క్యులేష‌న్‌లో ఈనాడు, సాక్షి, ఆంధ్ర‌జ్యోతి చెప్పుకోత‌గ్గ స్థాయిలో ఉన్నాయి. మిగిలిన ప‌త్రిక‌ల స‌ర్క్యులేష‌న్ ఎంత? అవి ప్రింట్ చేసేదెన్ని? ప‌్ర‌భుత్వానికి చెప్పేదెన్ని? జ‌నానికి చేరెదెన్ని?  వాటిని చ‌దివే పాఠ‌కులు ఎంద‌రు?  ఇలాంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ప్పుడు …గుండు సున్న అనే స‌మాధానం వ‌స్తుంది.

జ‌నం సొమ్మును మీడియాకు ఇష్టానురీతిలో దోచి పెట్ట‌డంలో తిలా పాపం త‌లా పిడికెడు అనే సామెత చందాన అన్ని ప్ర‌భు త్వాలు దొందుదొందే అని చెప్ప‌క త‌ప్ప‌దు. బాబు హ‌యాంలో ఆ ప్ర‌భుత్వానికి కొమ్ము కాసే ప‌త్రిక‌ల స‌ర్క్యులేష‌న్‌, ఇత‌ర‌త్రా నిబంధ‌న‌లేవీ భారీ మొత్తంలో ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డానికి అడ్డురావు. ప్ర‌భుత్వాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేది ఒక్క‌టే …ఆ మీడియా సంస్థ అనుకూల‌మా? వ్య‌తిరేక‌మా?. ఇంత‌కు మించి మ‌రే ప్రాతిప‌దిక దోచి పెట్ట‌డానికి లేదు.

గ‌త 20 నెల‌ల్లో త‌న‌కు కేవ‌లం రూ.25 ల‌క్ష‌లు మాత్ర‌మే ప్ర‌క‌ట‌న‌ల రూపంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇచ్చి, మిగిలిన వారికి కోట్ల‌కు కోట్ల‌కు దోచి పెడితే …బాధిత ప‌త్రిక త‌న‌కు తానుగా ఆ విష‌యాన్ని ఎందుక‌ని వార్త‌గా ఇవ్వ‌లేక‌పోయింది?  టీడీపీ మీడియా కమిటీ కన్వీనర్‌ దారపునేని నరేంద్ర స‌మాచార హ‌క్కు చట్టం కింద సేక‌రించిన స‌మాచారాన్ని హైలెట్ చేస్తూ ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నం ప్ర‌చురించ‌డం వెనుక ఉద్దేశం ఏంటి? త‌దిత‌ర ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయి.

బాబు హ‌యాంలో ఆంధ్ర‌జ్యోతి …మిగిలిన అన్ని మీడియా సంస్థ‌ల కంటే అత్య‌ధికంగా ల‌బ్ధి పొందింద‌న్న‌ది వాస్త‌వం. చంద్ర‌బాబంటే ఆంధ్ర‌జ్యోతి, ఆంధ్ర‌జ్యోతి అంటే చంద్ర‌బాబు అనే స్థాయిలో వాళ్ల మ‌ధ్య అనుబంధం పెన‌వేసుకుపోయింది. అందుకు త‌గ్గ‌ట్టే ఆదా యం కూడా ఉండింది. ఇప్పుడు జ‌గ‌న్ సొంత ప‌త్రిక సాక్షి అత్య‌ధికంగా ల‌బ్ధి పొంద‌డంలో ఆశ్చ‌ర్యం ఏముంది? ఇప్పుడు ప్ర‌భుత్వ వాయిస్ అంటే సాక్షినే గుర్తొస్తుంది.  

అస‌లు ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం కోసమే పుట్టుకొచ్చే ప‌త్రిక‌లు, యాడ్ ఏజెన్సీలు ఉన్నాయంటే ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే వ‌డ్డించే వాడు మ‌నోడైతే …నిబంధ‌న‌ల‌తో ప‌నేంటి? ఏదో చూపుడు కోసం ప్ర‌క‌ట‌న‌ల‌ను ముద్రించి ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పిస్తే …సొమ్ము దానిక‌దే న‌డుచుకుంటూ వ‌స్తున్న సంగ‌తి ఎవ‌రికి తెలియ‌దు. అంద‌రికీ అన్నీ తెలుసు. కానీ మన‌కు ఆదాయం పోయిన‌ప్పుడే అన్నీ గుర్తొస్తాయి. 

అన్యాయాన్ని ప్ర‌శ్నించ‌డం ప‌త్రికల నైజ‌మైతే… వాటికి పౌర‌స‌మాజం నుంచి మ‌ద్ద‌తు ఉంటుంది. అలా కాకుండా స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ఆక్రంద‌న‌లు చేస్తే …అల‌స‌ట త‌ప్ప మ‌రేమీ మిగ‌ల‌దు. అందుకే మీడియా ముసుగులో జ‌నం సొమ్మును కుమ్మేస్తున్న రాబంధుల ప‌ని ప‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.