ఏపీ ప్రభుత్వం టికెట్ల ధర పెంపు విషయంలో సినీ పరిశ్రమ విన్నపాలను పెద్దగా పట్టించుకోకపోవడంపై మెగాస్టార్ చిరంజీవి ఆక్షేపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చిత్రపరిశ్రమలను ఆదుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని చిరంజీవి కోరారట. చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలను పట్టించుకోవాలంటూ చిరంజీవి ఎమోషనల్ గా అడిగారట. చిరంజీవి విన్నపంలోని ఈ లైనును చూస్తే.. చిత్ర పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాలు అంటే, అవి వారి బోటివే కాబోలు అని అనుకోవాల్సి వస్తోంది.
చిత్రపరిశ్రమ మీద ఆధారపడిన కుటుంబాలంటే.. మెగా, నందమూరి, అల్లు, అక్కినేని, ఘట్టమనేని, దగ్గుబాటి, దిల్ రాజు.. వంటి వారి కుటుంబాలనేనా? ఈ కుటుంబాలను ఆదుకోవడానికి తక్షణం వీరంతా కోరుతున్నట్టుగా సినిమా టికెట్ల రేట్లను పెంచేయాలి కాబోలు!
చిత్ర పరిశ్రమ మీద ఆధారపడిన కుటుంబాల గురించి ప్రభుత్వం ఆలోచించాలి అని చిరంజీవి పిలుపును ఇస్తే..ఈ కుటుంబాలే గుర్తుకు వస్తున్నాయి మరి! చిత్రపరిశ్రమపై గుంపులు గుంపులుగా ఆధారపడ్డ కుటుంబాలు ఇవే కదా?
లేక.. సినీ కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టుల కుటుంబాలు… అంటారా? వారికి టికెట్ల రేట్లతో సంబంధం ఏముంది? సినిమా టికెట్ రేటు పెరిగితే.. కార్మికులకూ, చిన్న చిన్న ఆర్టిస్టులకూ రెమ్యూనిరేషన్లను పెంచేస్తారా? వాళ్లకు లాభాల్లో వాటా ఇస్తున్నారా? ఇవన్నీ జగమెరిగిన విషయాలే. మరి టికెట్ రేటును పెంచడం అంటే.. అది సినిమా పై ఆధారపడ్డ కుటుంబాలను ఆదుకోవడమే అయితే.. ఆ కుటుంబాలు నిస్సందేహంగా పరిశ్రమ అంతా తామైన ఏడెనిమిది కుటుంబాలనే తప్ప వేరే కుటుంబాలకు ఈ టికెట్ రేట్ల వల్ల ఒరిగేది కానీ, పోయేది కానీ ఏమీ లేదు!
ఇక చిత్రపరిశ్రమపై ఆధారపడ్డ వ్యక్తులను ఆదుకోవాలని కోరడానికి మించిన విడ్డూరం ఏమీ లేదు. పరిశ్రమపై ఆధారపడ్డ వారి సంక్షేమం అటుంచి, కనీసం తమతో సినిమాలు తీస్తున్న నిర్మాతలను హీరోలు ఎంత మేరకు పట్టించుకుంటున్నారు? తమ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి దివాళా తీసి రోడ్ల పక్కన టెంట్లేస్తున్న వారిని ఏ మేరకు ఆదుకుంటున్నారు? సినిమా మేకింగ్ చార్జ్ లో యాభై శాతం హీరోల రెమ్యూనిరేషనే అనే టాక్ లు వింటుంటే, ఒక్కో హీరో యాభై కోట్లు, వందల కోట్లు, నూటాభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నారనే మాటలు వింటుంటే.. ఇక ఏ ప్రభుత్వాలు కానీ ఎవరిని ఆదుకోవాలి?
తమ పారితోషికంలో పదో వంతు ఏదో సమాజ శ్రేయస్సుకు అక్కర్లేదు. తమ సినిమా కోసం పని చేస్తున్న వారి కోసం… తమతో సినిమా చేస్తున్న వారి శ్రేయస్సు కోసం.. ఖర్చు పెట్టొచ్చుగా. కరోనా కష్టాలను, మరో వాటినో దృష్టి పెట్టుకుని అయినా.. పది రూపాయల తక్కువ పారితోషకం తీసుకుంటున్న పదుల కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ హీరోలు ఎవరైనా ఉన్నారా? ఏ సినిమా సేఫ్ జోన్లో ఉండటం గురించి ఆ సినిమా హీరోనే ఆలోచించుకుంటే.. ఇక కష్టాలెక్కడున్నట్టు? పదుల కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న హీరోల సినిమాలను ఆదుకోవడానికీ ప్రభుత్వ సాయమే కావాలా? ఇదేమైనా న్యాయమైన మాటా మెగాస్టార్ గారూ?