మంత్రులు అన్నాక మర్యాదలు ఉంటాయి. వారికో ప్రోటోకాల్ ఉంటుంది. దానికి తగినట్లే చాలా మంది వ్యవహరిస్తారు. ఆ అధికార దర్పాలను, దర్జాల తెరలను తొలగించుకుని ముందుకు రావడానికి కొంత సంకోచిస్తారు. కానీ కొందరు మాత్రం కొంత విభిన్నత ప్రదర్శిస్తారు.
ఇపుడు విశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆ కోవలోనే నడుస్తున్నారు. ఆయన పెద్దగా ప్రోటోకాల్ మర్యాదలను పట్టించుకోరు. తన వద్దకు వచ్చిన వారికే కాదు, తాను చూసిన వారికి బాధిత జనాలను నేరుగా కలసి మరీ న్యాయం సాయం చేస్తారు.
ఈ మధ్య మంత్రి గారు పర్యటిస్తున్న రూట్లో ఇక యాక్సిడెంట్ జరిగితే వెంటనే తన వాహనాని ఆపి మరీ స్పాట్ లో యాక్షన్ తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించి తాను అమాత్యుడిని మాత్రమే కాదు, ఆప్తుడిని అని కూడా నిరూపించుకున్నారు.
ఇపుడు విశాఖ జిల్లా కలెక్టర్, అరకు ఎంపీ మాధవితో కలసి మంత్రి గారు నగర శివారులో ఉన్న ఒక ఉన్నత పాఠశాలను సందర్శించడమే కాకుండా అక్కడ విద్యార్ధినీ విద్యార్దులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.
వారు తిన్న ఆహార పదార్ధాలనే తానూ ఆస్వాదిస్తూ అక్కడ కష్ట నష్టాలను వారి నోటనే విని అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి మంత్రి గారి సింప్లిసిటీ మాత్రం ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు అంతా.