పవన్ ని పక్కాగా ఇరికించేసిన వీర్రాజు..!

సోము వీర్రాజు లేటెస్ట్ స్టేట్ మెంట్ మరీ వింతగా ఉంది. బీజేపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఆ ఎన్నిక ప్రచారానికి పవన్ ని పిలుస్తామని చెప్పారు. అసలు పవన్ పోటీయే వద్దన్నారు,…

సోము వీర్రాజు లేటెస్ట్ స్టేట్ మెంట్ మరీ వింతగా ఉంది. బీజేపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఆ ఎన్నిక ప్రచారానికి పవన్ ని పిలుస్తామని చెప్పారు. అసలు పవన్ పోటీయే వద్దన్నారు, దివంగత నేత కుటుంబానికి టికెట్ ఇచ్చారు కాబట్టి, సాంప్రదాయం ప్రకారం అక్కడ జనసేన తరపున అభ్యర్థిని పోటీకి దింపబోనన్నారు. ఆ స్థానం ఏకగ్రీవం చేసుకోవాలని సలహా కూడా ఇచ్చారు.

అలాంటి జనసేనాని బీజేపీ పిలిస్తే ప్రచారానికి వస్తారా..? ఎంత మిత్రపక్షం అయితే మాత్రం మరీ అంతలోనే మాట మార్చేస్తారా..? ఒకవేళ ప్రచారానికి వస్తే ఏం చెప్తారు. జనసేన పోటీలో లేదు కాబట్టి బీజేపీకి ఓటు వేయాలని చెబుతారా..? మొత్తమ్మీద ఇదేదో పవన్ కల్యాణ్ ని ఇరికించే వ్యవహారంలా కనిపిస్తోంది.

జనసేన, టీడీపీ పొత్తుపై కూడా స్పందించారు వీర్రాజు. టీడీపీకి జనసేన దగ్గరయ్యే ప్రసక్తే లేదంటూ జోస్యం చెప్పారు. అయితే లోలోపల మాత్రం వీర్రాజుకి భయం ఉండనే ఉంది. అందుకే పవన్ ని పక్కాగా ఇరికించేందుకు ఇలా బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారాస్త్రాన్ని ఉపయోగించారని సమాచారం. పోటీ చేయబోమంటూ పవన్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ తాను పోటీ చేస్తానడమే పెద్ద సాహసం.

అక్కడితో బీజేపీ మాట వేరు, జనసేన మాట వేరు అనే విషయం అర్థమైపోయింది. రాజకీయంగా ఏకాభిప్రాయం లేని పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఆశించలేం. అలాంటిది ఇప్పుడు పవన్ ని ఏకంగా ప్రచారానికి పిలుస్తున్నారంటే, దాన్ని ఎలా చూడాలి. నేను ప్రచారానికి రాను అని పవన్ నోటివెంటే చెప్పించాలనా.. ? లేక పవన్ ప్రచారంతో లబ్ధి పొందాలనా..?

అటు పవన్ ని లైన్లోకి తెచ్చుకోడానికే చంద్రబాబు కూడా ఎస్కేప్ గేమ్ ఆడారు. వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించి చాలా రోజులైనా.. ఇప్పుడే ఆ విషయం తెలిసినట్టు, సంప్రదాయం గుర్తొచ్చినట్టు చంద్రబాబు పోటీ నుంచి తప్పుకుంటున్నామన్నారు. పవన్ కల్యాణ్ ప్రకటన విడుదలైన మరుసటి రోజే బాబు కూడా, సంప్రదాయం అనే ముసుగులో పలాయనవాదం చిత్తగించారు. మరిప్పుడు పవన్ రంగంలోకి దిగి బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తే మధ్యలో బకరా అయ్యేది ఎవరు..?

ఇంతకీ అసలు పవన్ మనసులో ఏముందో చూడాలి. పోటీ విషయంలో నాన్చుడు ధోరణి ప్రదర్శించని పవన్,  ప్రచారం విషయంలో కూడా అంతే స్పీడ్ గా నిర్ణయం తీసుకుంటారా.? తనను ఇరికించాలని చూసిన వీర్రాజుకి 'నో' అని గట్టిగా బదులిస్తారా..? చూడాలి.