మంత్రులు బుగ్గ కార్లలో మాత్రమే తిరుగుతారని, వారంత దర్జా పద్దులు మరొకరు ఉండరని జనాల్లో ఒక కచ్చితమైన అభిప్రాయం ఉంది. అయితే అందరూ ఒక్కటి కాదు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది మంత్రులు జనాల్లోకి వెళ్తున్నారు. వారి కష్టనష్టాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రజలతో మమేకం కావడంతో ఎవరి స్టైల్ వారిదే. లేటెస్ట్ గా చూస్తే బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన గోపాల క్రిష్ణ విశాఖ జిల్లా టూర్లో అయితే ఏకంగా అధికారులకే షాక్ ఇచ్చేశారు. తాను చెప్పా పెట్టకుండా నర్శీపట్నంలోకి బాలుర గురుకుల పాఠశాలలోకి వెళ్ళారు.
వెళ్తూనే మంత్రి గారు నేరుగా కిచెన్ లోకి ప్రవేశించి అక్కడ విద్యార్ధుల కోసం సిద్ధంగా ఉన్న ఆహార పదార్ధాలను తనిఖీ చేయడం మొదలెట్టారు. మంత్రి గారు తమ గురుకుల వసతి గృహానికి వచ్చారని తెలుసుకున్న అధికారులు ఉరుకులు పరుగులు పెడితే మంత్రి ఏకంగా అక్కడ విద్యార్ధుల కోసం వండిన ఆహార పదార్ధాల రుచి చూశారు.
పనిలో పని అన్నట్లుగా అంబలి తాగి మరీ ఔరా అనిపించారు. మంచి భోజనం విద్యార్ధులకు పెడుతున్నారా లేదా అన్నది మంత్రి గారు అలా చెక్ చేసి హడలెత్తించేశారన్నమాట. అంతే కాదు, వసతి గృహంలో విద్యార్హ్దులకు సరిపడా మంచాలు లేకపోవడం చూసి అధికారులను ఆరా తీశారు.
ఒక ఒకే ఒక్క ఫోన్ కాల్ తో విద్యార్ధుల కోసం 240 మంచాలు పంపించమని మంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక వసతి గృహం మొత్తం తనిఖీ చేసిన మంత్రి గారు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని, సొంత భవనం కూడా ఏర్పాటు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
మొత్తానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ ఇలా విద్యార్ధులతో ఇంటరాక్ట్ కావడం సమస్యలు తెలుసుకోవడం చూసిన విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందలం నుంచి దిగి వచ్చి అంబలి తాగిన మంత్రిని చూసి అధికారులు సైతం షాక్ తిన్నారు.