నూతన పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై ఉద్యోగులు కారాలు మిరియాలు నూరారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్యోగులు టార్గెట్ చేశారు. సజ్జల రాజ్యాంగేతర శక్తి అని, సలహాదారుల పాలన అవసరం లేదని, సీఎంకు తప్పుడు సలహాలివ్వడం వల్లే తాము నష్టపోయామనే ఆవేదన ఉద్యోగుల విమర్శల్లో కనిపించింది. ఉద్యోగుల పేరుతో కొందరు బయటి వ్యక్తులు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారనే ఆరోపణలు కూడా లేకపోలేదు.
ప్రభుత్వంపై ఉద్యోగుల విమర్శలను ఎల్లో మీడియా, ప్రతిపక్షాల సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఉద్యోగుల విమర్శలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని, దాన్ని మరో కోణంలో రెచ్చగొట్టేలా వార్తా కథనాలను ప్రసారం చేయాలనే కుట్రలకు తెరలేపారు. అయితే ప్రభుత్వం మాత్రం సంయమనం పాటించింది.
తనపై నేరుగా తీవ్ర విమర్శలు చేసిన ఉద్యోగులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభించింది. ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శల విషయమై తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాము ఉద్యోగుల్ని ఏనాడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. ఉన్నంతలో ఉద్యోగులకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చామన్నారు. ఉద్యోగ సంఘాలు కూడా మంచిగా సహకరించడం వల్లే సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు. ఉద్యోగులు విమర్శించినా తమ వాళ్లే కదా అని అనుకున్నామని సజ్జల తన పెద్ద మనసును చాటుకున్నారు.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని చెప్పడమే కాదు, ఆచరణలో కూడా చూపారని సజ్జల సానుకూల స్పందనపై నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి శాశ్వతంగా ప్రభుత్వం మంత్రుల కమిటీని కొనసాగించనున్నట్టు ఇవాళ సీఎం ప్రకటించారు. ఉద్యోగుల విషయంలో వ్యతిరేకతను తగ్గించుకోవడంతో పాటు మంచి చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందనేందుకు ఈ చర్యే నిదర్శనం.