మాటలు అందరూ చెబుతారు. కొందరే చేతలలో చూపించగలరు. అలాంటి వారు అరుదు. మాట ఇస్తే తప్పని నైజం ఉన్న వారే ఇలాంటివి చేయగలరు. ఆ జాబితాలో జగన్ పేరు ముందు ఉంటుంది అని వైసీపీ నేతలు అంటున్నారు.
గతంలో ఎవరూ చేయలేని పనిని జగన్ చేసి చూపించారు అని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ఏపీలో విస్తృతమైన అభివృద్ధికి ఆయన తెర తీశారని కొనియాడారు. కొత్త జిల్లాల వల్ల పాలనా పరమైన సౌలభ్యం కలుగుతుందని, దూరం దగ్గర అవుతుంది అని పేర్కొన్నారు.
ఒకనాడు ఎక్కడో ఉన్న ఏజెన్సీ నుంచి విశాఖకు రావాల్సి వచ్చేదని, ఇపుడు విశాఖ ఏజెన్సీకి ఒక జిల్లాను కేటాయించడం శుభ పరిణామమని మంత్రి అన్నారు. అదే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో కేంద్ర నిధులు పెద్ద ఎత్తున వస్తాయని మంత్రి చెప్పారు. ఇదంతా జగన్ ముందు చూపునకు నిదర్శనం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక అన్ని జిల్లాలకు త్వరలోనే మౌలిక సదుపాయాలను కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు. గతంలో చాలా మంది కొత్త జిల్లాలు ఏర్పాటు అన్నారు కానీ వారు కనీసం టచ్ చేయలేకపోయారు. జగన్ మాత్రమే చేశారంటే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది అని మంత్రి పొగిడేశారు.
మరో వైపు ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనతో తమ ఎన్నికల హామీని పూర్తిగా నెరవేర్చామని చెప్పారు. కొత్త జిల్లాల మీద విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించి నెల రోజుల పాటుఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని కూడా చెప్పారు. అందరూ కోరుకున్న తీరుగానే కొత్త జిల్లాల కూర్పు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.