73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో చోటు దక్కించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు సహచరుడు చురక అంటించారు. కాంగ్రెస్ అధిష్టానంపై గత కొంత కాలంగా గులాం నబీ ఆజాద్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా గులాం రిటైర్ అవుతున్నప్పుడు, ఆయన్ను ఉద్దేశించి ప్రధాని మోడీ భావోద్వేగంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, జమ్ముకశ్మీర్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తమకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచుకునేందుకు ఆజాద్‌కు పద్మ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించిందనే వాదన లేకపోలేదు. ఇదే సందర్భంగా పద్మ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య ప్రకటించి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో గులాం నబీ ఆజాద్‌కు పద్మ పురస్కారం దక్కడంపై కాంగ్రెస్ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆజాద్‌కు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జైరాం రమేశ్ మాత్రం వెటకరించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ అజాద్‌గా ఉండాలని అనుకుంటున్నాడు.కేంద్రానికి గులాం అవ్వాలని బుద్ధదేవ్ అనుకోవడం లేదు అంటూ తన సహచరుడైన గులాం నబీకి పరోక్షంగా చురకలు అంటించారు. కేంద్ర ప్రభుత్వానికి గులాం కావాలని ఆజాద్ అనుకుంటున్నారనే అర్థం వచ్చే రీతిలో జైరాం రమేశ్ తన స్పందనను కాస్త కఠువుగా వ్యక్తపరచడం విశేషం.
అంతేకాదు, మాజీ బ్యూరోక్రాట్ పీఎన్ హస్కర్ పద్మ అవార్డును తిరస్కరించిన వైనంపై ఒక పుస్తకంలో వివరించిన భాగాన్ని జైరాం ట్విటర్లో పోస్టు చేయడం గమనార్హం. దీన్నిబట్టి గులాం తన పద్మ పురస్కారాన్ని తిరస్కరించకపోవడంపై కాంగ్రెస్ గుర్రుగా ఉందని అర్థం చేసుకోవచ్చు.