జగన్ సర్కార్ పాలన చూస్తా ఉంటే అలవాటులో పొరపాటున ఏదో ఒకరోజు తన ప్రభుత్వాన్ని తనకు తానే రద్దు చేయరు కదా అనే సందేహం వస్తోంది. పదుల సంఖ్యలో సలహాదారులను పెట్టుకున్న సీఎం…వారి నుంచి ఎలాంటి సలహాలు తీసుకుం టున్నారో, వారేం చెబుతున్నారో తెలియదు. కానీ జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదం అవుతోంది. ప్రజావేదిక కూల్చివేత మొదలుకుని, ఇసుక పాలసీ అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టే నిర్ణయం వరకు…అన్నీ వివాదాస్పదమే.
ఇక రివర్స్ టెండరింగ్ ఏంటో, దాని వల్ల ఆదా అవుతున్న సొమ్ము ఎంతో…ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. అలాగే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి పీపీఏల రద్దు, పునఃసమీక్ష తదితర అంశాలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. దీనివల్ల పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని కేంద్ర ప్రభుత్వం వాపోతోంది.
ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. పది మందితో చర్చించాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరగ చూడకూడదు. విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదు. జగన్ ఇంటి విషయానికి వద్దాం. జగన్ ఇంటిపై భారీగా ఖర్చు చేస్తున్నారని, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శించాయి.
ఇప్పుడు వారి విమర్శలకు బలం చేకూర్చేలా జగన్ సొంతిళ్లు, క్యాంప్ కార్యాలయాల్లో అదనపు సదుపాయాల కల్పించాలన్న నిర్ణయంపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. సుమారు రూ.2.87 కోట్ల విలువైన పనులను రద్దు చేస్తూ ఆర్అండ్‌బీ అధికారులు ఆదేశాలిచ్చారు.
తాడేపల్లిలోని నివాసంతో పాటు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని నివాసానికి మౌలిక సదుపాయాలు, ఇతర రక్షణ చర్యలకు సంబంధించి చేపట్టాలని నిర్ణయించిన ఆరు పనులను రద్దు చేయాలని కోరుతూ ఆర్‌అండ్‌బీ విభాగం చీఫ్ ఇంజనీర్‌తో ప్రతిపాదనలు చేయించారు. రాత్రికి రాత్రే ఆ పనుల జీవోలను రద్దుచేస్తూ ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. అయితే ఏ ఒక్క ఉత్తర్వులోనూ రద్దుకు కారణాలను చూపకపోవడం జగన్ పాలనలో డొల్లతనాన్ని ఎత్తి చూపుతోంది.