అఖిల‌ప్రియ త‌ప్పుల మీద త‌ప్పులు

మాజీ మంత్రి, ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. భూమా అఖిలప్రియ చ‌ర్య‌ల‌తో ఆమెకు ప‌బ్లిసిటీ వ‌స్తున్న‌దే త‌ప్ప … క్రెడిబులిటీ పోతోంద‌న్న నిజాన్ని గ్ర‌హించ‌డం…

మాజీ మంత్రి, ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. భూమా అఖిలప్రియ చ‌ర్య‌ల‌తో ఆమెకు ప‌బ్లిసిటీ వ‌స్తున్న‌దే త‌ప్ప … క్రెడిబులిటీ పోతోంద‌న్న నిజాన్ని గ్ర‌హించ‌డం లేద‌న్న అభిప్రాయాలు సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పైగా ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌ప్రియ‌పై తీవ్ర వ్య‌తిరేక‌త రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌తో అఖిల‌ప్రియ అంటే టీడీపీ నేత‌లు భ‌యంతో జ‌డుసుకుంటున్నారు.

తాజాగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సినిమాను త‌ల‌ద‌న్నేలా అఖిల‌ప్రియ డ్రామాను ర‌క్తి క‌ట్టించార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తు న్నాయి. సోష‌ల్ మీడియాలో అఖిల‌ప్రియ‌పై టీడీపీ అభిమానులే మండిప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, ఓ ప‌థ‌కం ప్ర‌కారం టీడీపీకి డ్యామేజీ క‌లిగించేలా అఖిల‌ప్రియ ఆడిన నాట‌కాన్ని ఆ జిల్లా ముఖ్య‌నేత‌లు చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లార‌ని స‌మాచారం. ప‌రిష‌త్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆళ్ల‌గ‌డ్డ‌లోని శివాల‌యం వేదిక‌గా అఖిల‌ప్రియ సీన్ క్రియేట్ చేయ‌డం వెనుక నిజానిజాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వ‌స్తున్నాయి. అసలు వాస్త‌వాలేంటో తెలిసి చంద్ర‌బాబు, లోకేశ్ ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని స‌మాచారం.

వైసీపీ ప్ర‌భుత్వ అరాచ‌కాల‌కు నిర‌స‌ర‌గా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అధిష్టానం నిర్ణ‌యాన్ని కాద‌ని, తాము బ‌రిలో ఉంటున్నామ‌ని భూమా అఖిల‌ప్రియ ప్ర‌క‌టించ‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది. ఒక మ‌హిళా నాయ‌కురాలు గ‌ట్టిగా నిల‌బ‌డ్డార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు ముందురోజు రాత్రి వైసీపీ ముఖ్య‌నేత‌ల‌తో ఆమె రాజీ కుదుర్చుకున్నార‌ని టీడీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆళ్ల‌గ‌డ్డ మండ‌లంలో న‌ల్ల‌గ‌ట్ల, ఓలంప‌ల్లె, దొర్నిపాడు మండ‌లంలోని డ‌బ్ల్యూ.కొత్త‌ప‌ల్లె ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి, మిగిలిన స్థానాల‌న్నీ వైసీపీకి ఇచ్చేలా ఒప్పందం జ‌రిగిన‌ట్టు టీడీపీ అభ్య‌ర్థులే ఆరోపిస్తున్నారు. కొత్త‌ప‌ల్లె భూమా అఖిల‌ప్రియ స్వ‌గ్రామం కావ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఆళ్ల‌గ‌డ్డ మండ‌లంలో ఓ ఎంపీటీసీ స్థానం విష‌య‌మై వివాదం నెల‌కుంది. ఆళ్ల‌గ‌డ్డ మండ‌లంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలున్నాయి.

ఇందులో 9 వైసీపీకీ, మ‌రో రెండు న‌ల్ల‌గ‌ట్ల, ఓలంప‌ల్లె ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి ఇచ్చేలా వైసీపీతో అఖిల‌ప్రియ ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు ఆ పార్టీ అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. మిగిలిన 9 స్థానాల్లో బాచేప‌ల్లి టీడీపీ అభ్య‌ర్థి అఖిల‌ప్రియకు అడ్డం తిరిగాడు. దీంతో అక్క‌డ వైసీపీ, టీడీపీ మ‌ధ్య పోటీ త‌ప్ప‌లేదు. మిగిలిన చోట్ల ఒప్పందం కుదుర్చుకున్న మేర‌కు ఆయా పార్టీల అభ్య‌ర్థులు ఏక‌ప‌క్షంగా ఓటింగ్ జ‌రుపుకున్నారు.

ఈ నేప‌థ్యంలో బాచేప‌ల్లి స్థానాన్ని వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఆ ఊరికి ఆళ్ల‌గ‌డ్డ 18వ వార్డు కౌన్సిల‌ర్ భ‌ర్త‌, ప‌ట్ట‌ణంలో ప్ర‌ముఖ డాక్ట‌ర్‌గా పేరొందిన డాక్ట‌ర్ సురేంద్ర‌నాథ్‌రెడ్డి వెళ్లార‌నే సాకుతో అఖిల‌ప్రియ స‌రికొత్త ఎత్తుగ‌డకు శ్రీ‌కారం చుట్టారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పెద్ద‌మ్మ కుమారుడే డాక్ట‌ర్ సురేంద్ర‌నాథ్‌రెడ్డి.

అంటే అఖిల‌ప్రియ‌కు కూడా స‌మీప బంధువే. వ‌రుస‌కు అన్న అవుతాడు. అయితే ఆళ్ల‌గ‌డ్డ‌లో క్ర‌ష‌ర్ మిష‌న్ విష‌యంలో గొడ‌వ ప‌డ్డ శివ‌రామిరెడ్డికి సురేంద్ర‌నాథ్‌రెడ్డి స్వ‌యాన బామ్మ‌ర్ది. దీంతో వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో సురేంద్ర‌నాథ్‌రెడ్డిని ఇబ్బందుల‌పాలు చేసేందుకు అఖిల‌ప్రియ యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేసుకున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. 

డాక్ట‌ర్ సురేంద్ర‌నాథ్‌రెడ్డి స్వస్థ‌లం బాచేప‌ల్లి. ఆయ‌న ఆ ఊరికి పోయింది నిజ‌మే కానీ, అఖిల‌ప్రియ ఆరోపిస్తున్న‌ట్టు జ‌న‌ర‌ల్ ఏజెంట్ ఎంత మాత్రం కాద‌ని పోలీసులు చెబుతున్నారు. ఓటరే కాని తాను, జ‌న‌ర‌ల్ ఏజెంట్‌గా ఎలా కూచుంటాన‌ని డాక్ట‌ర్ సురేంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాను భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌తో క‌లిసి బాచేప‌ల్లికి వెళుతున్నాన‌ని అఖిల‌ప్రియ ఇటు పోలీసులు, అటు మీడియాకు సమాచారం ఇచ్చి హైప్ క్రియేట్ చేశారు. అనంత‌రం డాక్ట‌ర్ సురేంద్ర‌నాథ్‌రెడ్డి ఇంటి స‌మీపంలోని శివాల‌యానికి వెళ్లారు. అక్క‌డ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అప్పుడు స్టార్ట్ అయిన షూటింగ్‌ ఓ గంట‌న్న‌ర పాటు కొన‌సాగింది. 

బాచేప‌ల్లిలో వైసీపీకి చెందిన డాక్ట‌ర్ సురేంద్ర‌నాథ్‌రెడ్డి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, అడ్డుకోడానికి వెళుతున్న అఖిల‌ప్రియ‌ను పోలీసులు అడ్డుకున్నారంటూ ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లు వాస్త‌వాలేంటో, వైసీపీతో అఖిల‌ప్రియ చేసుకున్న లోపాయికారి ఒప్పందం ఏంటో బాగా తెలిసిన టీడీపీ అభ్య‌ర్థులు, ప్ర‌జానీకం మాత్రం …ఇదంతా ఆమె ప‌బ్లిసిటీ స్టంట్ అంటూ అస‌హ్యించుకుంటున్నారు.  న‌ల్ల‌గ‌ట్ల, ఓలం ప‌ల్లెలో టీడీపీ అభ్య‌ర్థులు య‌థేచ్ఛ‌గా ఓట్లు వేసుకున్నార‌ని, మిగిలిన చోట్ల వారి ప్ర‌త్య‌ర్థులైన వైసీపీ అభ్య‌ర్థులు ఓట్లు వేసుకు న్నార‌ని నియోజ‌క‌వ‌ర్గం అంతా కోడై కూస్తోంది.

ప‌రిష‌త్ ఎన్నిక‌లను బ‌హిష్క‌రించాల‌ని చంద్ర‌బాబు చెప్పినా, అఖిల‌ప్రియ మాట‌లు న‌మ్మి బ‌రిలో నిలిచి, డ‌బ్బు పంప‌కాలు చేసి, చివ‌రికి లోపాయికారి ఒప్పందంతో నిండా మునిగిపోయామ‌ని టీడీపీ అభ్య‌ర్థులు ల‌బోదిబోమంటున్నారు. మొత్తానికి నిన్న‌టి ఎపిసోడ్‌తో అఖిల‌ప్రియ భూమా కుటుంబ క్రెడిబులిటీకి పాత‌రేసింద‌నే ఆగ్ర‌హం వ్యక్త‌మ‌వుతోంది.