చిల్ల‌ర వేషాలు.. అల్లు ఫ్యాన్స్ పై కేసులు

తెలుగు నాట సినీ అభిమానం వెర్రి త‌ల‌లు వేయ‌డం కొత్తేమీ కాదు. రోజు రోజుకూ ఈ వ్య‌వ‌హారం శ్రుతి మించుతూనే ఉంది. చ‌దువూ సంధ్యాలేని వెర్రి వెధ‌వలు కొంద‌రైతే, చ‌దువుకున్న మూర్ఖులు మ‌రి కొంద‌రు.…

తెలుగు నాట సినీ అభిమానం వెర్రి త‌ల‌లు వేయ‌డం కొత్తేమీ కాదు. రోజు రోజుకూ ఈ వ్య‌వ‌హారం శ్రుతి మించుతూనే ఉంది. చ‌దువూ సంధ్యాలేని వెర్రి వెధ‌వలు కొంద‌రైతే, చ‌దువుకున్న మూర్ఖులు మ‌రి కొంద‌రు. సినిమాను సినిమాగా అభిమానించ‌డంలో త‌ప్పేం లేదు. అయితే ఈ అభిమానం ఇత‌రుల పాలిట న్యూసెన్స్ గా మారిన‌ప్పుడే కోప‌మొచ్చేది. 

సినీ అభిమానం తెలుగునాట మ‌రో మ‌తం అయిపోయింది. ఈ విష‌యంలో ఆ హీరో అభిమానులూ, ఈ హీరోలూ అభిమానులూ అంటూ తేడా లేదు. ఎవ‌రి అభిమానుల‌మ‌ని చెప్పుకునే వాళ్లు కూడా ఆ తానులో ముక్క‌లే. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్ అభిమానుల‌పై తెలంగాణ‌లో కేసులు న‌మోదయ్యాయి. ఆ హీరో పుట్టిన రోజు సంద‌ర్భంగా బంజారాహిల్స్ ఏరియాలో ర‌చ్చ చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు.

త‌మ అభిమాన హీరో పుట్టిన రోజు అంటూ బంజారా హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి ముందు అభిమానులు అంత‌కు ముందు రోజు రాత్రి ర‌చ్చ చేశారు. అక్క‌డ భారీగా గుమిగూడి పటాసులు పేల్చ‌డంతో పాటు, య‌థారీతిన బైకుల‌ను అతిగా హార‌న్లు కొడుతూ న‌డ‌ప‌డం, కేక‌లు వేయ‌డం.. తో స‌హా నానా ర‌భ‌స సృష్టించారు. దీనిపై స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు. 

మామూలు టౌన్ల‌లో అయితే ఈ అతిగాళ్ల‌, మూర్ఖుల ర‌భ‌స‌ను సామాన్య ప్ర‌జ‌లు త‌ప్ప‌క భ‌రిస్తూ ఉంటారు. అది బంజారాహిల్స్ కావ‌డంతో అక్క‌డి వారు పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అక్క‌డ  ర‌చ్చ చేసిన ఫ్యాన్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. 

కేసులు న‌మోదు చేయ‌డం కాదు.. ర‌చ్చ చేసేట‌ప్పుడే పోలీసులు లాఠీ చార్జీలు చేసి ఉంటే కానీ ఈ మూక‌లు దారికి వ‌చ్చేవి కావేమో. విశేషం ఏమిటంటే.. ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండా త‌న ఫ్యాన్స్ వీధుల్లో ర‌చ్చ చేస్తుంటే.. వారికి అర్ధ‌రాత్రి వ‌చ్చి అభివాదాలు చేశాడు అల్లు అర్జున్. మ‌రి ఈ న్యూసెన్స్ వ్య‌వ‌హారంలో అల్లు అర్జున్ పై కేసులుండ‌వా?