శభాష్ విశాఖ అన్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖను తలచుకున్నారు. విశాఖ గురించి ప్రస్థావిస్తూ పొగిడారు. విశాఖను ఒక స్పూర్తిగా తీసుకోవాలని కూడా దేశానికి సూచించారు. ఇంతకీ విశాఖ ఏ ఘనత సాధించి మోడీ వంటి ఘనత వహించిన…

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖను తలచుకున్నారు. విశాఖ గురించి ప్రస్థావిస్తూ పొగిడారు. విశాఖను ఒక స్పూర్తిగా తీసుకోవాలని కూడా దేశానికి సూచించారు. ఇంతకీ విశాఖ ఏ ఘనత సాధించి మోడీ వంటి ఘనత వహించిన ప్రధాని నోట తన పేరు పలికేలా చేసుకుందంటే చాలా చెప్పాలి.

మహా విశాఖ నగరపాలక సంస్థ ప్లాస్టిక్ నిషేధం మీద కఠినమైన చర్యలను తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానంలో గుడ్డ సంచులను వాడాలని జీవీఎంసీ కఠిన నిబంధనలనే అమలు చేసింది. అదే విధంగా స్వచ్చ భారత్ మీద అవగాహన కల్పించేందుకు విశాఖ అంతా విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తోంది.

ఈసారి ఎలాగైనా స్వచ్చ సర్వేక్షణ్ లో ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని జీవీఎంసీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. దాంతో ప్రధాని మోడీ విశాఖలో ప్లాస్టిక్ రహిత వాడకం మీద తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రస్థావించి విశాఖ భేష్ అని కొనియాడారు.

కేవలం పెద్ద వారికే కాకుండా పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులకు కూడా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ఇబ్బందులు వివరించడంతో పాటు స్వచ్చ నగరం ఆవశ్యకతను తెలియచేసే బృహత్తరమైన కార్యక్రమానికి మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. మొత్తానికి విశాఖ కమిషనర్ లక్ష్మీ షా ఆద్వర్యాన వినూత్నమైన ఆలోచనలతో స్వచ్చ కార్యక్రమాలను నిర్వహించడంతో అది జాతీయ స్థాయిలోకి వెళ్లి  ఈ రోజు ప్రధాని మోడీ నోట కూడా పలికింది.

దీంతో అంతా జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షాను అభినందిస్తున్నారు. శభాష్ జీవీఎంసీ అని కూడా అంటున్నారు. మరి మోడీ చూపు ఎటూ విశాఖ మీద పడింది కదా రానున్న రోజులలో ఇక్కడ సమస్యల మీద దృష్టి సారించి అభివృద్ధి వైపుగా నగరాన్ని మేలి మలుపు తిప్పుతారు అని ఆశించవచ్చా అన్న ఆలోచలను కూడా వస్తున్నాయి.

అదే విధంగా విశాఖను త్వరలోనే పరిపాలనా రాజధానిగా చేస్తాను అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పట్టుదలగా ఉన్న తరుణంలో మోడీ విశాఖ సిటీని మెచ్చుకోవడం అంటే శుభ పరిణామంగా వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి విశాఖకు మంచి రోజులు రాబోతున్నాయన్న మాట అయితే వినిపిస్తోంది.