మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తాను ఇవ్వని వాంగ్మూలాన్ని ఇచ్చినట్టు పేర్కొన్న సీబీఐతో పాటు ప్రచురించిన ఈనాడు పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని కల్లూరు గంగాధర్‌రెడ్డి తెలిపాడు. వివేకా హత్యా నేరాన్ని తనపై వేసుకుంటే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తారని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చాడని సీబీఐకి కల్లూరు గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.
గత ఏడాది అక్టోబర్ 2న సీబీఐ అధికారులకు కల్లూరు గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. ఇతను పులివెందుల మండలం పుట్రాయినిపేట నివాసి. ఇతని తండ్రి 40 ఏళ్ల క్రితమే అరబ్ దేశాలకు వెళ్లి వచ్చాడు. ఇతను పులివెందులలో నివాసం ఉండేవాడు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో సన్నిహితంగా మెలిగేవాడు. పలు గొడవల్లో ఇతను నిందితుడు. దీంతో గొడవలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అనంతపురం జిల్లా యాడికి అనే మండల కేంద్రానికి వెళ్లినట్టు సమాచారం. 9 సంవత్సరాలుగా యాడికిలోనే అతను నివాసం ఉంటూ, వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో వివేకా హత్యకు సంబంధించి సీబీఐకి గంగాధర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిలను ఇరికించేలా ఉంది. దీంతో అతను ఇవాళ మీడియా ముందుకొచ్చాడు. ఈనాడు పత్రికలో రాసినట్టు సీబీఐకి తాను వాంగ్మూలం ఇవ్వలేదన్నాడు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన సీబీఐ, ఈనాడు పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించాడు.
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తామని శివశంకర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చారనడంలో వాస్తవం లేదన్నారు. వివేకా హత్యతో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు ప్రమేయం ఉందని ఒప్పుకోవాలని సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ తనపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. కానీ తప్పుడు సాక్ష్యం చెప్పడం వల్ల అనవసర తలనొప్పి అని, ఎందుకు సార్ ఇవన్నీ అని సీబీఐ అధికారితో తాను అన్నట్టు గంగాధర్‌రెడ్డి చెప్పాడు. అయితే ఏమొచ్చినా తాము చూసుకుంటామని సీబీఐ అధికారి భరోసా ఇచ్చినట్టు గంగాధర్‌రెడ్డి చెప్పుకొచ్చాడు.
అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు హత్యతో సంబంధం ఉందని చెబితే రూ.50 లక్షల నగదు, కారు, ఆస్పత్రి ఖర్చులు తామే భరిస్తామని డాక్టర్ సునీత బంధువు జగదీష్‌రెడ్డి ఆఫర్ ఇచ్చాడని ఆరోపించాడు. ఈ సందర్భంగా రూ.20 వేల నగదు తనకు ఇచ్చాడన్నాడు. ఆ తర్వాత తన అకౌంట్‌కు రూ.40 వేలు జగదీష్‌రెడ్డి పంపినట్టు గంగాధర్‌రెడ్డి చెప్పాడు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు అతను తెలిపాడు.
ఇదిలా వుండగా వాంగ్మూలం ఇచ్చినట్టు సంతకం చేయడంపై గంగాధర్‌రెడ్డి వివరణ ఇచ్చాడు. విచారణకు హాజరైనట్టు తెల్ల కాగితంపై సంతకం చేయాలని సీబీఐ అధికారులు కోరిన మేరకు చేశానన్నాడు. తాను చెప్పినట్టు వాయిస్ రికార్డ్ వినిపిస్తే, దేనికైనా సిద్ధమని అతను స్పష్టం చేశాడు. సీబీఐ, జగదీష్‌రెడ్డి, డాక్టర్ సునీత కేసును తప్పుదారి పట్టిస్తున్నారని అతను ఆరోపించాడు. వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఏడేళ్లుగా తనకు, వాళ్లకు మధ్య మాటలు కూడా లేవని గంగాధర్‌రెడ్డి చెప్పడం గమనార్హం.