ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణను ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు అవమానించారు. ఒక తిట్టు తిట్టకుండా, ఒక దెబ్బ వేయకుండా…విస్మరణతోనే ఆర్కే ఇగోను రామోజీ దెబ్బతీశారు. మౌనంతో చంపడం అంటే ఎలాగో రామోజీని చూసే నేర్చుకోవాలి. ఆర్కే అంటే రామోజీకి ఎంత చిన్నచూపో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదివి తీరాల్సిందే.
ఆర్కేను రామోజీ అవమానించారనేందుకు కరోనా వైరసే సాక్షి. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో మీడియా పాత్ర ప్రశంసనీయం. ఇందులో భాగంగా ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా పలువురు ప్రింట్ మీడియా అధిపతులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థల అధిపతులు పాల్గొన్నారు.
ఈ సమాచారానికి సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల వెబ్ పేజీలో వార్త ఇచ్చారు. ఈ వార్తను ఆంధ్రజ్యోతిలో ‘మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే’ అనే శీర్షికతో ఇచ్చారు. అలాగే కథనానికి వస్తే… ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రింట్ మీడియా అధిపతులతో ప్రధాని మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా అనుసంధానకర్తగా పనిచేయాలి అని పేర్కొన్నారు’….అని రాసుకొచ్చారు.
ఇక ఈనాడు విషయానికి వెళ్దాం. ‘పత్రికాధిపతులతో ప్రధాని సమావేశం’ శీర్షికతో వార్త రాశారు. వార్తలోకి పోతే…‘వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోదీ పలువురు ప్రముఖుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ దేశంలోని పత్రికాధిపతులతో సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు’…అని ఇచ్చారు.
ఈ వార్తలో కనీసం రామోజీతో పాటు ఆర్కే పాల్గొన్నారనే ఒక్క పదం రాయడానికి కూడా ఈనాడు ఇష్టపడక పోవడం గమనార్హం. అంటే రామోజీతో సమాన స్థాయిని ఆర్కేకు కల్పించడం ఈనాడుకు ఏ మాత్రం ఇష్టం లేదని అర్థం చేసుకోవాలా? లేక ఆర్కేను కనీస ఒక పత్రికాధిపతిగానే ఈనాడు, రామోజీ గుర్తించలేదా?
కానీ ఆంధ్రజ్యోతిలో మాత్రం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అని స్పష్టంగా రాసి గౌరవించారు. చంద్రబాబు భగవద్గీతైన ఈనాడులో …బాబు భక్తుడైన ఆర్కే పేరు రాయకుండా అవమానించడం సరైందా? ఆర్కేను హర్ట్ చేశారు. ఎంతైనా ఈ బాధ బయటికి చెప్పుకోలేనిది.