క్వారంటైన్‌లో ఉన్నా ఆ ప్రేమ జంట ముద్దూముచ్చటకు తక్కువేం కాలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్ ప్రేమ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్‌లు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ఆ ప్రేమ జంట క్వారంటైన్‌లో కూడా చెట్టాపట్టాలేసుకుని డ్యూయెట్స్ పాడుకోవడం విశేషం.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సినిమా షూటింగులన్నీ రద్దు చేసి, లాక్ డౌన్ ప్రకటించడంతో ఈ ప్రేమజంట ఇంటికి పరిమితమైంది. ఏడాదిగా డేటింగ్ లో ఉన్న మలైకా అరోరా, అర్జున్ కపూర్ లు జనతా కర్ఫ్యూ సందర్భంగా కూడా హోం క్వారంటైన్ లో ఉల్లాసంగా గడిపారు.
మలైకా అరోరా గతంలో బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. అనంతరం వాళ్లిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మలైకా అరోరా మనసులో మరొకరికి స్థానం దక్కింది. బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ కుమారుడు, సినీహీరో అర్జున్ కపూర్ తో ఆమె ప్రేమలో పడ్డారు.
మలైకాఅరోరా పలు రియాలిటీ షోలకు కో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తన చలాకీతనంతో అభిమానులను సంపాదించుకున్నారు. యోగా, ఫ్యాషన్ స్టూడియోలు కూడా మలైకా నడుపుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. క్వారంటైన్‌లో ఈ ప్రేమ జంట ఆటపాటల గురించి సోషల్ మీడియోలో తెగ చర్చించుకుంటున్నారు.