ఎప్పుడూ షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపై నటులకు….కరోనా కావాల్సినంత తీరిక సమయాన్ని ఇచ్చింది. ఈ సమయాన్ని నటులు ఒక్కో రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు నటులు కుటుంబ సభ్యులతో ఆడుతూపాడుతూ గడుపుతున్నారు. మరికొందరు సేవా కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. మరికొందరు ఇతరత్రా తమకిష్టమైన పనులు చేసేందుకు కరోనా విశ్రాంతి సమయాన్ని వాడుకుంటున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీరాజా మాత్రం రైతు అవతారమెత్తాడు. ఇదేమీ నటన మాత్రం కాదండోయ్. తన ఫామ్‌హౌస్‌లో ఆయన పంటలు పండిస్తున్నాడు. అంటే శివాజీరాజా వ్యవసాయం చేస్తూ రైతుగా మారాడు. అంతేకాదు, తన ఫామ్‌హౌస్‌లో పండించిన పంటలను చుట్టపక్కల వాళ్లకు పంచాలని ఆయన నిర్ణయించుకున్నాడు.
పనిలో పనిగా `మా` అసోసియేషన్ సభ్యులకు సహాయం చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చాడు. పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తానని ఆయన చెప్పాడు. తనలాగే ఈ `స్టే హోమ్ ఛాలెంజ్`కోసం మరో ఐదుగురిని ఆయన నామినేట్ చేశాడు. సీనియర్ డైరెక్టర్స్ ఎస్వీ కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, హీరో శ్రీకాంత్, హాస్య నటుడు అలీ, నటుడు ఉత్తేజ్‌లకు ఈ ఛాలెంజ్‌ను శివాజీరాజా విసిరాడు. విపత్కర పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మలచుకున్న శివాజీరాజా, తనలాగే మరికొందరిని మంచి పనిలో భాగస్వామ్యం చేయాలనుకోవడం నిజంగా అభినందనీయం.